- బీసీ అభ్యర్థిని గెలిపించి.. ఐక్యతను చాటాలి: జాజుల
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు పార్టీలకు అతీతంగా సబ్బండ కులాల మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించి బడుగుల రాజకీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వినయ్ కుమార్ శనివారం హైదరాబాద్లోని బీసీ భవన్ కు వచ్చి బీసీ సంఘాల నేతలతో భేటీ అయ్యారు.
బీసీ సంఘాలు, కుల సంఘాలు నవీన్ యాదవ్ కు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ కు రాష్ట్రంలోని 136 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, 12 ఉద్యోగ సంఘాల తో పాటు సబ్బండ కులాలు మద్దతు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
