- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హనుమకొండ సిటీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్‍ను స్తంభింపజేయాలని, లేదంటే ఎంపీల ఇండ్లు ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో బీసీ సంఘాల నేతలతో కలిసి చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు.
డిసెంబర్ 9న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై సవతితల్లి ప్రేమ చూపుతున్నాయన్నారు. పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాలకు బీసీలంటే గిట్టడం లేదన్నారు. దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలన్నారు. లేదంటే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు రవికృష్ణ గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్, సంగాని మల్లీశ్వర్, బొనగాని యాదగిరి, దాడి మల్లయ్య, ఎంజాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
