రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పరవాల్నా? భారత్లో ఉండేందుకు వారికి చట్టబద్ధతే లేదు: సుప్రీంకోర్టు

రోహింగ్యాలకు  రెడ్ కార్పెట్ పరవాల్నా? భారత్లో ఉండేందుకు వారికి చట్టబద్ధతే లేదు: సుప్రీంకోర్టు
  • దేశంలో ఎందరో పేదరికంతో అలమటిస్తుంటే.. 
  • చొరబాటుదారులకు రక్షణ కల్పించాల్నా
  • వారేమీ శరణార్థులూ కాదు.. వారికి హక్కులు కల్పించాలనడం ఏమిటి?
  • పిటిషనర్​పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: రోహింగ్యాల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారేమీ శరణార్థులు కాదని, వారికి భారతదేశంలో ఉండేందుకు చట్టబద్ధత ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘‘చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తే.. వారి రక్షణకు మనం బాధ్యత వహించాల్నా? దేశంలో ఎంతోమంది పేదరికంలో అలమటిస్తున్నారు. దేశ ప్రజలు పేదరికంతో పోరాటం చేస్తుంటే.. రోహింగ్యాలకు మనం రెడ్​ కార్పెట్​ పరిచి స్వాగతం పలకాల్నా”అంటూ పిటిషనర్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే నెలలో కొందరు రోహింగ్యాలను ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత వారి జాడ కనిపించడంలేదని, వారిని కోర్టు ముందు హాజరుపరచాలని  సోషల్​ యాక్టివిస్ట్​  రిటా మన్​చందా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజేఐ జస్టిస్​ సుర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్య బాగ్చి ధర్మాసనం విచారించి..  స్పందించింది.

వెనక్కి పంపితే సమస్యేంది?

భారత్​లో ఉండేందుకు చొరబాటుదారులకు ఎలాంటి చట్టబద్ధత లేనప్పుడు.. అలాంటి వారిని తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కోరడంలో ఆంతర్యమేమిటని పిటిషనర్​ను సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​ ప్రశ్నించారు. ‘‘నార్త్​ ఇండియాలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉంది. అలాంటి బోర్డర్​ను దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారికి మనం బాధ్యత వహించాల్నా? వాళ్లు టన్నెల్స్​ నుంచి, ఫెన్సింగ్​ నుంచి ఇల్లీగల్​గా చొరబడ్తున్నారు. ఆపై.. మేం ఇండియాలో ఉన్నామని, మీ చట్టాల ద్వారా మాకూ హక్కులు కల్పించాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నారు. ఆహారం, ఆశ్రయం పొందే హక్కు, పిల్లలకు చదువుల హక్కు ఇట్లా అన్నీ అడుగుతున్నారు. వాళ్లు ఉండటానికే దేశంలో చట్టబద్ధతలేదు. అలాంటిది వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్నా. అక్రమ చొరబాట్లను జాతీయ భద్రత కోణంలోనూ ఆలోచించాలి” అని పేర్కొన్నారు. రోహింగ్యాలను తిరిగి వాళ్ల దేశాలకు పంపితే సమస్య ఏమిటని ప్రశ్నించారు. 

దేశంలోని పేదల హక్కులపై ఫోకస్​ పెట్టండి

దేశంలో ఎంతో మంది పేదలు ఉన్నారని, ఏండ్లుగా పేదరికంలోనే మగ్గిపోతున్నారని, వారి గురించి మనం ఆలోచన చేయాలని  పిటిషనర్​కు సుప్రీంకోర్టు సూచించింది. ‘‘మన దేశంలో ఎందరో పేదలు ఉన్నారు. ఇక్కడి పేదల గురించి మనం ఆలోచించాలి. వారు మన పౌరులు. వాళ్ల ఆకలి బాధల గురించి మనం స్పందించాలి. వారి ప్రయోజనాలు, హక్కులపై ఎందుకు ఫోకస్​ పెట్టకూడదు. దేశంలో ఎందరో పేదరికంలో బతుకుతుండగా.. అక్రమ చొరబాటుదారులకు రెడ్​ కార్పెట్​పరవాల్నా? వారేమీ శరణార్థులు కాదు.. అలాంటి చట్టబద్ధత ఏమీ లేదు. వెనక్కి పంపిన రోహింగ్యాలను తిరిగి ప్రవేశపెట్టాలనడం కరెక్ట్​ కాదు. అది తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు” అని పేర్కొంది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.  

సీజేఐపై టీఎంసీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

అక్రమంగా దేశంలోకి వచ్చే రోహింగ్యాలకు మనం రెడ్​ కార్పెట్​ పరవాల్నా అంటూ సీజేఐ జస్టిస్​ సుర్యకాంత్​ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్​లోని టీఎంసీ ఎంపీ కల్యాణ్​ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఈరోజుల్లో న్యాయమూర్తులు లూజ్​ కామెంట్స్​ చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడుతున్నారు. గతంలో తీర్పులు ఇచ్చేటప్పుడే మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్​ మారింది. టీఆర్​పీలను పెంచుకోవడానికి లూజ్​ కామెంట్స్​ చేస్తున్నారు.. తీర్పులు మాత్రం ఇవ్వడం లేదు” అని కల్యాణ్​ బెనర్జీ పేర్కొన్నారు. దీనికి బీజేపీ కౌంటర్​ ఇచ్చింది. ‘‘జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని అక్రమ చొరబాటుదారులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే.. టీఎంసీ ఎంపీ విమర్శలు చేయడం ఏమిటి? టీఎంసీ నేతలు అన్ని హద్దులను దాటుతున్నారు. కోర్టుపైనా దాడి చేస్తున్నారు. టీఎంసీ నేతలకు ఎప్పుడూ ఓఆర్​పీ (ఓట్​ రేటింగ్​ పాయింట్)​ కావాలి. అందుకే అక్రమ వలసలకు మద్దతిస్తున్నారు” అని బీజేపీ ఎంపీ షెహజాద్ పూనావాలా కౌంటర్  ఇచ్చారు.