సౌతాఫ్రికాతో రెండో వన్డే ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీంఇండియా గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తుంటే.. మరోవైపు సఫారీలు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలగా ఉంది. తొలి వన్డే ఇచ్చిన విజయంతో భారత జట్టు ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సఫారీలతో జరగనున్న రెండో వన్డే ఇద్దరు యువ క్రికెటర్లకు కీలకంగా మారనుంది.
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. కేవలం 18 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆరంభంలో రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన జైశ్వాల్.. బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ లేకపోవడంతో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముంబై యువ బ్యాటర్ తనకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జైశ్వాల్ వన్డే అరంగేట్రం చేసిన తొలి వన్డేలో కూడా 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో సౌతాఫ్రికాతో జరగబోయే రెండో వన్డే జైశ్వాల్ కు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో నిరూపించుకోకుంటే జైశ్వాల్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు.
►ALSO READ | Moeen Ali: డుప్లెసిస్ బాటలో స్టార్ ఆల్ రౌండర్: ఐపీఎల్ వద్దని పాకిస్థాన్ లీగ్ ఆడనున్న ఇంగ్లాండ్ క్రికెటర్
మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు కూడా రెండో వన్డే అత్యంత కీలకంగా మారనుంది. రాక రాక వచ్చిన అవకాశాన్ని గైక్వాడ్ ఉపయోగించుకోలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నాలుగో స్థానములో బ్యాటింగ్ కు దిగి కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రేవీస్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ వలన గైక్వాడ్ కు నిరాశ తప్పలేదు. రెండేళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం వచ్చినా గైక్వాడ్ విఫలమయ్యాడు. మ్యాచ్ విన్నర్ ను పంత్ ని సైతం పక్కన పెట్టి గైక్వాడ్ కు అవకాశమిచ్చినా నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో ఆడకపోతే గైక్వాడ్ టీమిండియాలో చోటు మర్చిపోవడమే.
