- ‘తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరిచెట్లు ఎండిపోయాయి’ అన్న కామెంట్లపై ఆగ్రహం
- పవన్.. బాధ్యతగా మాట్లాడటం నేర్చుకో: మంత్రి పొన్నం
- ఆ మాటలు ఉపసంహరించు కోవాల్సిందేనని డిమాండ్
- తలతిక్క మాటలు మానుకోకపోతే ఇబ్బందులు తప్పవు: మంత్రి వాకిటి శ్రీహరి
- రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపొద్దని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్లపై రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రిగా చెప్తున్న. పవన్ కల్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆయన సినిమాలను ఆడనిచ్చేది లేదు” అని హెచ్చరించారు.
హైదరాబాద్ నిధులతోనే విజయవాడ, వైజాగ్ ను అభివృద్ధి చేసుకున్నారని.. అలాంటిది తెలంగాణపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. ‘‘తెలంగాణ వచ్చి ఇప్పటికే 13 ఏండ్లు అయింది. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? ఇలాంటి వ్యాఖ్యలతో మా తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నరు. పవన్ కల్యాణ్ పరిపక్వత లేని మాటలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డిప్యూటీ సీఎం కాగానే ఆయన తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన అన్న చిరంజీవిలా హుందాగా వ్యవహరించాలి” అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు.
పవన్.. బాధ్యతగా మాట్లాడు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అన్నదమ్ముల మాదిరిగా ఉంటాయని.. అలాంటిది ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని పవన్ కల్యాణ్ అనడం ఏమిటి అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘‘పవన్ కల్యాణ్ మాటలు చూస్తుంటే ఆయన వివేకవంతుడా... అవివేకవంతుడా అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ కు మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై వివరణ ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. వెంటనే పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతగా మాట్లాడాలని, విజ్ఞతగా వ్యవహరించాలని సూచించారు.
ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి: వాకిటి శ్రీహరి
పవన్ కల్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపే ఇలాంటి మాటలు మంచిది కాదన్నారు. ‘‘పవన్ తలతిక్క మాటలతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నరు. ఇక్కడి వనరులను వినియోగించుకొని ఈ స్థాయికి ఎదిగిన పవన్.. ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం విచారకరం” అని పేర్కొన్నారు.
