దశాబ్దాలుగా భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టాలు, వికలాంగుల సంక్షేమం కోసం అనేక జీవోలు ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. దీంతో వికలాంగులు, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి సాధించలేకపోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది వికలాంగులు దశాబ్దాల తరబడి ఉద్యమించారు. కొంత మంది వికలాంగులు ప్రాణాలు అర్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారి జీవితాలు వెలుగులతో నిండిపోతాయి అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. డిసెంబర్ 3, 2023 ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు సాధించింది, 7న అధికారం చేపట్టింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదిక నుంచి మొదటి సంతకం వికలాంగ సోదరి రజినికి ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి ముద్ద వికలాంగుల సమాజానికి అందించారు.
ఉచితంగా ట్రై మోటరైజ్డ్ స్కూటీలు
వికలాంగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా ట్రై మోటరైజ్డ్ స్కూటీలు అందించేలా జీవో నెంబర్ 89 ఇచ్చి సమర్థవంతంగా అమలు జరుగుతోంది. వీటితోపాటు బ్యాటరీ వీల్ చైర్లు, బ్యాటరీ సైకిల్, బిజినెస్ ఎంపవర్ కార్ట్స్ లాంటి అనేక పరికరాలు 40 శాతం వైకల్యానికి అందించేలా జీవోలో పొందుపరచడం జరిగింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు 40% వైకల్యం ఉంటే వికలాంగుల సంక్షేమంలో ఏ అంశమైనా పొందవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉపకరణాలు 40% బెంచ్ మార్క్ వైకల్యానికి ఇవ్వడం లేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా వికలాంగులు- వికలాంగులను పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మితోపాటు అదనంగా రూ. లక్ష ప్రోత్సాహకం ఇచ్చేలా జీవో తెచ్చి అమలు తెచ్చింది ప్రజాప్రభుత్వం.
వికలాంగ ఉద్యోగుల కలల సాకారం
వికలాంగులుగా జన్మించిన ఆరు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి.. వారికి అవసరమయ్యే అధునాతనమైన వైద్య సౌకర్యాలను కల్పిస్తూ అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడం లక్ష్యంగా బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభమైంది. వివిధ శాఖలలో పనిచేస్తున్న వైకల్యం కలిగిన ఉద్యోగులు ఎక్కడైతే వారు ఉద్యోగం చేస్తున్నారో అదే స్థానంలో ప్రమోషన్ పొంది ఎలాంటి స్థాన బదిలీ లేకుండా జీవో నెంబర్ 34ను తెచ్చి వికలాంగ ఉద్యోగ కుటుంబాల్లో చిరునవ్వులు తేబడ్డాయి. నేటి తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో వారి కలలు సాకారం చేసిన గొప్ప చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది. పై 4 అంశాలు వికలాంగుల సంక్షేమంలో దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతాయి.
వికలాంగుల సంక్షేమానికి కొత్త జీవోలు
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌కి చైర్మన్‌గా నన్ను మెదటి నాలుగు నెలలలోపే నియమించారు. ఆ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో వికలాంగుల సంక్షేమం ఆర్థిక స్వావలంబన దిశగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వికలాంగుల సంక్షేమశాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో వికలాంగుల సంక్షేమానికి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ అనేక కొత్త జీవోలను ఇచ్చి సమర్థవంతంగా అమలు జరుగుతున్నాయి. నేటి ప్రజాపాలన ప్రభుత్వంలో వికలాంగులకు ఉన్నత విద్యలో 5% శాతం రిజర్వేషన్ కల్పించింది. కోర్టు ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చాయి. పోలీస్ శాఖలో సైతం అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో నియమించిన ఉద్యోగాలలో వికలాంగులకు అవకాశం కల్పించింది ప్రజాప్రభుత్వం.
ముత్తినేని వీరయ్య,
చైర్మన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ
