నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైన్స్ షాపులు దక్కించుకున్న యజమానులు ఎమ్మెల్యే సూచన మేరకు ఊరి బయటే షాపులను ఓపెన్ చేయడమే కాకుండా.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే విక్రయాలు మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్‌రూంలోకి అనుమతి ఇస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులు.. బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ కాకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్‌రూంలకు అనుమతి ఇవ్వొద్దని టెండర్లు వేసే టైంలోనే వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సూచించారు. వీలైతే స్థానికంగా ఉన్న వ్యక్తులే వైన్స్ టెండర్లు వేసేలా ప్రోత్సహించారు.
తర్వాత వైన్ షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో రాజగోపాల్‌రెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైన్స్‌ను మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే తెరవాలని, సాయంత్రం ఆరు గంటల నుంచి పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించడంతో ఇందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఊరి బయటే ఏర్పాటు చేసిన మద్యం షాపులను సోమవారం ప్రారంభించి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విక్రయాలు ప్రారంభించారు.
