హైదరాబాద్: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవని ఆయన హెచ్చరించారు. క్షమాపణ చెపితే ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుందని మంత్రి ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో రెండు రోజులైనా సినిమాలు ఆడుతాయని, లేదంటే సినిమా నడువదని.. ఈ మాట సినిమాటోగ్రఫీ మంత్రిగా చెపుతున్నానని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. పవన్ కల్యాణ్ తెలిసీ, తెలియకుండా మాట్లాడుతున్నారని.. డిప్యూటీ సీఎం కాగానే పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
చిరంజీవి సూపర్ మ్యాన్ అని కితాబు ఇచ్చిన మంత్రి.. పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవని చెప్పుకొచ్చారు. 60 ఏళ్లు మేము బాధపడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగామని.. తమ నిధులు, నీళ్లు, ఉద్యోగాలు తీసుకుకెళ్ళారని ఉమ్మడి ఏపీలో తెలంగాణ దుస్థితిని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్కి వచ్చిన పైసలతో విజయవాడ , వైజాగ్.. ఇలా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.
తెలంగాణ వచ్చి ఇప్పటికి 13 ఏళ్లు అయిందని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నారని, గత సీఎం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని కేసీఆర్కు పరోక్షంగా చురకలంటించారు. ఆ అప్పులు కడుతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హిత బోధ చేశారు.
