పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్​ది తప్పుడు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌‌రావు, కేంద్రమంత్రి బండి సంజయ్‌‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. రాంచందర్‌‌రావు విద్యార్థి దశ నుంచే రిజర్వేషన్ వ్యతిరేకిగా ఉన్నారని, మండల కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారని ఆరోపించారు. 

బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్​ చారితో కలిసి జాజుల.. ఆగస్టు 7న గోవాలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌‌ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్డినెన్స్ తెచ్చినా కోర్టులలో నిలువదని గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 34% నుంచి 18%కి తగ్గించిందని విమర్శించారు.