ఇదేం పని మేడమ్..! బాలికల గురుకుల హాస్టల్‌‌ ప్రిన్సిపాల్‌‌ రూమ్‌‌లో బీర్‌‌ బాటిళ్లు

ఇదేం పని మేడమ్..! బాలికల గురుకుల హాస్టల్‌‌ ప్రిన్సిపాల్‌‌ రూమ్‌‌లో బీర్‌‌ బాటిళ్లు
  •      ఆందోళనకు దిగిన స్టూడెంట్లు
  •     విచారణకు ఆదేశించిన మంత్రి, కమిటీని నియమించిన కలెక్టర్‌‌

సూర్యాపేట, వెలుగు : స్టూడెంట్లకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ మహిళా ప్రిన్సిపాల్‌‌ తన రూమ్‌‌లో బీర్‌‌ బాటిళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో 300 మందికిపైగా స్టూడెంట్లు ఉన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్‌‌గా శైలజ పనిచేస్తోంది. ప్రిన్సిపాల్‌‌ రూమ్‌‌లో బీర్‌‌ బాటిళ్లను గుర్తించిన స్టూడెంట్లు శనివారం తెల్లవారుజామున ప్రిన్సిపాల్‌‌ గదికి తాళం వేశారు. 

అక్కడే ఉన్న సహాయ కేర్‌‌ టేకర్‌‌ సౌమిత్రిని నిలదీశారు. అనంతరం ఈ ఘటనపై ఎంక్వైరీ జరపాలంటూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌‌ శైలజ విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని, సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌‌కు సహకరిస్తున్న సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. స్టూడెంట్లు ఆందోళన చేస్తున్న టైంలోనే కేర్‌‌ టేకర్‌‌ ఆత్మహత్యకు యత్నించడంతో గమనించిన సిబ్బంది, స్టూడెంట్లు అడ్డుకున్నారు. 

స్టూడెంట్ల ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణుమాధవ్‌‌రావు, కళాశాలల ఆర్సీవో అరుణ కుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతితో పాటు పోలీసులు కాలేజీకి వచ్చారు. ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా స్టూడెంట్లు ఒప్పుకోలేదు. సహాయ కేర్‌‌ టేకర్‌‌ సౌమిత్రితో కలిసి మద్యం సేవిస్తూ స్టూడెంట్లపై వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేశారు. అనంతరం ఆఫీసర్ల హామీతో ధర్నాను విరమించారు.

విచారణకు ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌‌ గదిలో బీర్‌‌ సీసాలు దొరకడం, స్టూడెంట్ల ఆందోళనపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అడిషనల్‌‌ కలెక్టర్‌‌ బీఎస్‌‌.లతను విచారణ అధికారిగా, డిప్యూటీ సీఈవో శిరిష, సూర్యాపేట ఆర్డీవో వేణుమాదవ్, ఎస్సీ అభివృద్ధి అధికారి లతను కమిటీ సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్‌‌ తేజస్‌‌ నందలాల్‌‌ పవార్‌‌ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని సూచించారు.