సందుకో బెల్టు షాపు

సందుకో బెల్టు షాపు
  • తాగినోళ్లకు తాగినంత.. పొద్దూ మాపు ఓపెన్
  • కిరాణా షాపుల్లోనూ  కావాల్సిన బ్రాండ్లు.. 
  • కొన్నిచోట్ల డోర్ ​డెలివరీలు 
  • రాష్ట్రంలో 2,216  వైన్​ షాపులు.. వీటి పరిధిలో  లక్ష బెల్టు షాపులు
  • త్వరలో  మరో 225 వైన్ షాపులకు అనుమతి

వెలుగు, నెట్​వర్క్​: ఏడ పడితే ఆడ.. తాగినోళ్లకు తాగినంత.. రాష్ట్రంలో మందు మస్తుగా దొరుకుతున్నది. ఏ ఊర్లె చూసినా, ఏ సందులో చూసినా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నయ్. పొద్దుమాపు తేడా లేకుండా వాటిని ఖుల్లా పెడ్తున్నరు. జనం తిప్పలు పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లిక్కర్​ ఆదాయం పెంచుకోవడంపైనే ఫోకస్​ చేస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో 2014--–-15లో రాష్ట్ర లిక్కర్​ ఆదాయం రూ. 10 వేల కోట్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఏకంగా రూ. 30 వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా ముందుకుపోతున్నది. సర్కారు పెట్టిన లిక్కర్​ టార్గెట్లు అందుకునేందుకు ఎక్సైజ్​శాఖ గల్లీ గల్లీకి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో 2,216  వైన్​ షాపులు ఉండగా.. వీటి పరిధిలో దాదాపు లక్ష బెల్టు షాపులు నడుస్తున్నయ్. ప్రతి ఊరిలో సగటున పదికిపైగానే బెల్టుషాపులు రన్​ అవుతున్నయ్.  కిరాణా షాపుల్లోనూ కావాల్సిన లిక్కర్​ బ్రాండ్స్​ దొరుకుతున్నయ్​. కొన్ని చోట్ల తాగాలనుకున్నోళ్లు ఫోన్​ కొట్టడమే ఆలస్యం, బెల్టుషాపుల నుంచే డోర్ డెలివరీలు అందుతున్నయ్​. బెల్టు షాపులకు బహిరంగ వేలంపాటలు, లక్షలు పెట్టి దక్కించుకున్నోళ్లకు సన్మానాలు కూడా జరుగుతున్నయ్​. బెల్టుషాపుల ముందు చిత్తుగా తాగి జనాలు పడిపోతున్నా, బెల్టుషాపుల్లో తాగిన మత్తులో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నా వాటిని బంద్​ చేయించేందుకు సర్కారుకు మనసు వస్తలేదు.

లిక్కర్​ ఇన్​కం మస్తు పెరిగింది

తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే లిక్కర్​ఆదాయాన్ని రాష్ట్ర సర్కారు ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. 2014----–15లో రూ. 10 వేల 880 కోట్లు ఉండగా..  2020---–21లో దీనిని రూ. 27 వేల 280 కోట్లకు చేర్చింది. ఈ ఏడాది రూ. 30 వేల కోట్ల మేర పెంచాలని ఎక్సైజ్​శాఖకు టార్గెట్​పెట్టింది. దీంతో విచ్చలవిడిగా  బెల్టుషాపులు వెలుస్తున్నాయి. బహిరంగంగానే వాటిని వేలంపాట వేసి దక్కించుకుంటున్నారు. ఆఫీసర్లు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి గడిచిన 6 నెలల్లోనే  రూ. 14,320 కోట్ల సరుకు అమ్ముడుపోయింది. 1.75 కోట్ల కేసుల లిక్కర్​,1.53 కోట్ల కేసుల బీరు అమ్మారు. రాబోయే ఆరునెలల్లో మిగిలిన 16 వేల కోట్లు రాబట్టేందుకు ఎక్సైజ్​ శాఖ రేయింబవళ్లు కష్టపడుతున్నది. దీనికి తోడు న్యూ పాలసీ అమల్లోకి రానున్న డిసెంబర్​ నుంచి కొత్తగా మరో 225 వైన్ షాపుల​ ఏర్పాటుకు ప్రపోజల్స్​ రెడీ చేసింది.

కల్తీ లిక్కర్​ను అరికట్టడం, మద్య నియంత్రణకు కృషి చేయడం ఆబ్కారీ శాఖ విధులు. ఆ శాఖను ‘స్టేట్​ ప్రొహిబిషన్ ​ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్’ అని పిలిచేది అందుకే. కానీ లిక్కర్​ ఆమ్దానీపైనే ఫోకస్​ పెట్టిన రాష్ట్ర సర్కారు.. ఆబ్కారీ ఆఫీసర్ల డ్యూటీని పూర్తిగా మార్చేసింది. సేల్స్​ టార్గెట్​ను  ఏటా 10 నుంచి 20% పెంచేస్తోంది. ఏడేండ్లుగా తాగుడు మాన్పించేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టని ఎక్సైజ్​ ఆఫీసర్లు.. సేల్స్​ పెంచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. షాపుల వారీగా ప్రతి నెలా 10 నుంచి 20% ఎక్కువగా అమ్మాలని జిల్లా ఆఫీసర్లకు పైనుంచి ఆర్డర్స్​ వేస్తున్నారు. టార్గెట్ రీచ్​ కాకుంటే అక్కడి అధికారులు, సిబ్బందిని ట్రాన్స్​ఫర్లు, డీ గ్రేడ్​ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు.  టార్గెట్లు రీచ్​అయినవారిని ప్రమోషన్లతో ఎంకరేజ్​ చేస్తున్నారు. ఉన్నత అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేని జిల్లా ఆఫీసర్లు.. సేల్స్​ పెంచాలని  వైన్​​​షాపులపై పడుతున్నారు. మీ పరిధిలో ఎన్ని బెల్టుషాపులు పెట్టుకున్నా , టార్గెట్​ రీచ్ ​కావాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు.

పెరుగుతున్న క్రైం రేట్​

ఆబ్కారోళ్లే పర్మిషన్​ ఇస్తుండడంతో వాడవాడలా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. లక్షలు పోసి షాపులు దక్కించుకున్నవాళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా లిక్కర్​ అమ్ముతున్నారు. మత్తులో మందుబాబులు హత్యలు, అత్యాచారాలు, నేరాలకు పాల్పడుతున్నారు. క్రైం రేట్  పెరిగిపోతోందని పోలీసులు ఆఫ్ ​ది రికార్డ్​ చెప్తున్నారు. 2019లో 4,260 లైంగిక వేధింపుల కేసులు, 2020లో 4,876 కేసులు ఫైలయ్యాయి. 2019లో 1,780 అత్యాచారాలు, 193 హత్యలు జరగ్గా.. 2020లో 1,934 రేప్​లు,  161మర్డర్లు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లా ముషంపల్లిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను తాగిన మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి గుంజుకెళ్లి రేప్​ చేసి, చంపేశారు. ఆ వార్తను కవర్​ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లు ఆ ఒక్క గ్రామంలోనే ఎనిమిది బెల్టుషాపులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం పేపర్లలో, టీవీ చానళ్లలో వచ్చినప్పటికీ ఇప్పటివరకు అక్కడ బెల్టుషాపులను ఆఫీసర్లు తొలగించలేదు.

పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో 15కుపైగా బెల్టు షాపులు

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో దాదాపు 15కుపైగా బెల్టు షాపులు ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లిక్కర్​ అమ్ముతున్నారు. తాగిన మత్తులో కొందరు వీధుల్లో తిరుగుతూ గొడవలు చేస్తున్నారు. ఈ మధ్య కొమురవెల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులు బెల్టు షాపులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఊర్లోని బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయొద్దని వైన్​ షాపుల యజమానులను కోరారు. అయినా బెల్టు షాపులకు మద్యం సరఫరా, అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.

ఒక గ్రామం.. 50 బెల్టు షాపులు..

ఇది ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వల్లభి గ్రామం. ఏపీ బోర్డర్​లో ఉంటుంది. జనాభా 6 వేలు. ఏపీలో లిక్కర్​రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి వచ్చి తాగుతుంటరు. గిరాకీ ఎక్కువ ఉండడంతో ఒక్క గ్రామంలో 50 వరకు బెల్ట్ షాపులు వెలిసినయ్​.  రోడ్డు పక్కన రేకులు, పర్దాలు కట్టి ఎక్కడికక్కడ సిట్టింగులు నిర్వహిస్తున్నరు. కిరాణా షాపుల్లోనూ కూల్​డ్రింక్స్​లాగే లిక్కర్​ బాటిళ్లు అమ్ముతున్నరు.  నెలకు తక్కువలో తక్కువ ఈ ఒక్క ఊరిలోనే రూ. 20 లక్షలకు పైగా లిక్కర్​ అమ్మకాలు జరుగుతున్నయ్​.

మనిషి చచ్చినా బెల్టు షాపు బంద్​ కాలే..

ఈ ఏడాది ఫిబ్రవరి 25న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలోని ఓ బెల్ట్ షాపులో హత్య జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్వర్​కు, పల్లె పోశెట్టికి పక్కపక్కనే పొలాలున్నయ్​. దారి విషయంలో ముందురోజు గొడవ జరిగింది. మరుసటి రోజు రాత్రి గ్రామంలోని బెల్ట్​షాప్​ వద్ద ఇద్దరు మందు తాగేటప్పుడు మాటమాట పెరిగింది. ఆగ్రహానికి గురైన పోశెట్టి.. రాజేశ్వర్​ను కత్తితో పొడిచి హత్య చేసిండు. దీంతో గ్రామంలో బెల్ట్​ షాపులను మూసేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగగా.. బెల్టుషాపులను మూసేస్తామని పోలీసులు హామీ ఇచ్చిన్రు. ఇది జరిగి ఎనిమిది నెలలుగడుస్తున్నా బెల్టుషాపులను మాత్రం మూసేయలేదు.

ఎనుకాల ఎమ్మెల్యే ఉండు.. ఎవరొస్తరో రండి..

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపూర్​లో నిజామాబాద్​ - జగ్దల్​పూర్​ హైవే 63 పక్కన ఉన్న దాబా హోటల్ ​ఇది. మండలానికి చెందిన టీఆర్​ఎస్​ బడా లీడర్ అనుచరుడు దీనిని నడిపిస్తున్నడు. చెన్నూర్​లోని వైన్​షాపుల నుంచి లిక్కర్​ తీసుకొచ్చి ఇక్కడ దర్జాగా అమ్ముతున్నడు. రాత్రి, పగలు బార్​ను తలపించేలా సిట్టింగ్​ నిర్వహిస్తుండు. దాబాలో చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​, ఆయన ప్రధాన అనుచరుడు కోటపల్లి మండల వైస్​ ఎంపీపీ వాల శ్రీనివాసరావు ఫొటోలతో ఫ్లెక్సీ పెట్టుకొని సిట్టింగ్​ నిర్వహిస్తున్నడు. ఎన్​హెచ్​ 63 పక్కనే డే అండ్​ నైట్​ లిక్కర్​ దందా నడుస్తున్న ప్పటికీ ఎక్సైజ్​ ఆఫీసర్లు గానీ, పోలీసులు గానీ కన్నెత్తి చూడడం లేదు.

బయట కిరాణం.. లోపల లిక్కర్​..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని ఓ ఊర్లో బయటికి కిరాణంలాగా కనిపిస్తున్న ఇది నిజానికి బెల్టు షాపు. గ్రామ సర్పంచ్, ఊరి పెద్దలంతా కలిసి రెండేండ్ల కోసం టెండర్లు నిర్వహించగా.. రూ. 32 లక్షలతో ఓ వ్యక్తి దీనిని దక్కించుకున్నడు. ఈ గ్రామంలో 6 వేల జనాభా ఉండగా, బెల్ట్ షాప్ ద్వారా ప్రతి నెలా దాదాపు రూ. 40 లక్షల టర్నోవర్ జరుగుతున్నది. ప్రస్తుతం ఈ షాపు టెండర్ ముగింపు దశకు వచ్చింది. నవంబర్ నెలలో మళ్లీ కొత్త టెండర్​ పిలిచేందుకు గ్రామ సర్పంచ్​ ఏర్పాట్లు చేస్తున్నరు.

ఇక్కడ లిక్కర్​ డోర్ డెలివరీ

హైదరాబాద్​లాంటి సిటీల్లోనూ లేని ఫెసిలిటీ యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో చూడవచ్చు. ఇక్కడ కొందరు బెల్ట్​షాపుల నిర్వాహకులు మందు బాటిల్స్ ను  డోర్ డెలివరీ చేస్తున్నరు. ఫోన్​లో ఆర్డర్​ ఇస్తే చాలు, టౌన్​లో ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నరు. బ్రాండ్ల​ను బట్టి రూ. 30 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నరు. బాటిల్​తో పాటు స్టఫ్​ కూడా సప్లయ్ చేస్తున్నరు. ఈ మున్సిపాలిటీలో మూడు వైన్స్​ ఉండగా, వాటి పరిధిలో 30 బెల్ట్​ షాపులు రన్​ అవుతున్నయ్.

మా ఊర్లోనే 20 బెల్టు షాపులు  
మా ఒక్క ఊర్లోనే 20 బెల్టు షాపులు ఉన్నయ్. గతంలో ఎప్పుడూ ఇట్ల సూడలే. ఇండ్లల్లనే మందు దొరుకుతాంది. అందరూ తాగుడుకు అలవాటైతన్రు. మద్యం మత్తులో గొడవలు ఎక్కువైతున్నయి. అధికారులు ఈ బెల్టు షాపులను వెంటనే బంద్​​ పెట్టాలె. లేదంటే ఊరు ఆగమైతది.- కౌటం కొమురయ్య, తాడిచెర్ల, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా.