ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. స్మార్ట్ వాచ్ లో క్యూ ఆర్ కోడ్

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. స్మార్ట్ వాచ్ లో క్యూ ఆర్ కోడ్

దేశంలోని ఇప్పుడు క్యాష్ వాడడం చాలా తగ్గిపోయింది. చాలా మంది డిజిటల్ పేమెంట్స్ కే మొగ్గు చూపుతున్నారు. చేతిలో నగదు తీసుకుని బయటికెళ్లాలన్న పోకడలకు స్వస్తి పలకడానికి ప్రజలు అలవాటుపడ్డారు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. బెంగుళూరులో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్.. క్యూఆర్ కోడ్ ను తన స్మార్ట్ వాచ్ లో స్ర్కీన్ సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆన్ లైన్ చెల్లింపులు చేయాలనుకునే వారికి తన వాచ్ ను చూపించి పేమెంట్స్ పొందుతున్నాడు.

ఈ విషయాన్ని ఓ ట్విట్టర్ యూజర్ పంచుకున్నారు. తాను ఇటీవల ఆటో ఎక్కానని.. డ్రైవర్ కు డబ్బులు చెల్లించేందుకు ‘నమ్మయాత్రి’ సేవను ఎంచుకున్నానని చెప్పాడు. అయితే పేమెంట్ చేసేందుకు బార్ కోడ్ ను అడగగా.. ఆ డ్రైవర్ తన చేతికున్న స్మార్ట్ వాచ్ చూపించాడని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని రాసుకువచ్చాడు. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి ఆయన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు.

ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇప్పుడు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆటో డ్రైవర్ తెలివిని మెచ్చుకుంటున్నారు. బెంగళూరులోని  ఐటీ ఉద్యోగులకంటే ఆటో డ్రైవర్లు స్మార్ట్ గా మారారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15న షేర్ అయిన ఈ ట్వీట్‌కు 3లక్షళ 56వేల కంటే ఎక్కువ వ్యూస్స్, 7వేల 4వందల కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.