ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు 100 మంది నిరుద్యోగుల నుంచి రూ. 25 కోట్లు వసూలు చేసిన ఓ జంటను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జేసన్ డిసౌజా (39), అతని భార్య లవీనా (36)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే పని మొదలుపెట్టారు.
సమాచారం ప్రకారం... నిందితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనూ, ముఖ్యంగా కోర్టుల్లో డి-గ్రూప్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితులను నమ్మించి... ఇలా ఒక్కోక్కరి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారు. దీనికోసం వీరికి ఏజెంట్ల నెట్‌వర్క్ కూడా ఉంది.
జడ్జిల సంతకాలు ఉన్న నకిలీ నియామక పత్రాలను సృష్టించి బాధితులకు చూపించేవారు. లాడ్జీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసేవారు. ఆ తర్వాత బాధితులను కోర్టు భవనాల దగ్గరకు తీసుకెళ్లి.. ఇక్కడే మీకు పని ఉంటుంది అని నమ్మించేవారు. తీరా డబ్బులు చేతికి అందాక పరార్ అయ్యేవారు.
ఇలా మంజునాథ్ అనే వ్యక్తి కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగం కోసం వీరికి రూ. 13.5 లక్షలు ఇచ్చి మోసపోయాడు. కోర్టుల్లో గ్రూప్-డి ఉద్యోగాలు ఇప్పిస్తామని తనను కూడా నమ్మించారని నాగరాజ్ అనే బాధితుడు తెలిపాడు.
చివరికి బసవేశ్వరనగర్ సహా ఇతర స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ జంట 2023 నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025లో కూడా వీరిపై ఓ కేసు నమోదైంది. నిరుద్యోగులు ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
