ఐపీఎల్‌లో బెంగళూరు జైత్రయాత్ర.. వరుసగా నాలుగో విక్టరీ

ఐపీఎల్‌లో బెంగళూరు జైత్రయాత్ర.. వరుసగా నాలుగో విక్టరీ
  • పడిక్కల్‌ షో.. చెలరేగిన కోహ్లీ
  • బెంగళూరు ఫోర్త్‌‌ విక్టరీ
  • 10 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ ఓటమి
  • రాణించిన సిరాజ్‌‌, హర్షల్‌‌

ఐపీఎల్‌‌–14లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది..! దేవదుత్‌‌ పడిక్కల్‌‌ (52 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 నాటౌట్‌‌) సెంచరీకి తోడుగా కెప్టెన్‌‌ కోహ్లీ (47 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 నాటౌట్‌‌) సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చూపెట్టడంతో.. వరుసగా నాలుగో విక్టరీతో టేబుల్‌‌ టాపర్‌‌గా నిలిచింది..!  హార్డ్‌‌ హిట్టర్లున్న రాజస్తాన్‌‌ను అద్భుతంగా కట్టడి చేసిన ఆర్‌‌సీబీ.. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లోనూ అదే స్థాయిలో చెలరేగిపోయింది..! కేవలం కోహ్లీ–పడిక్కలే 178 రన్స్‌‌ టార్గెట్‌‌ను ఛేదించి భళా అనిపించారు..! మరోవైపు శివమ్‌‌ దూబే (32 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), రాహుల్‌‌ తెవాటియా (23 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40)  పోరాటానికి... రాయల్స్‌‌ బౌలర్లు అండగా నిలువలేకపోయారు..!!

ముంబై: ప్లేయర్ల కాంబినేషన్‌‌ను.. సక్సెస్‌‌ను ఫార్ములాగా మార్చుకున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.. ఐపీఎల్‌‌లో చెలరేగిపోతున్నది.  తమకు అడ్డొచ్చిన ప్రతి ప్రత్యర్థిని నిలువరిస్తూ... భారీ టార్గెట్లను సైతం నీళ్లు తాగినంత సులువుగా ఛేదిస్తున్నది. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లోనూ ఆర్‌‌సీబీ మరో 21 బాల్స్‌‌ మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌పై గెలిచింది. టాస్‌‌ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. తర్వాత  బెంగళూరు 16.3 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా 181 రన్స్‌‌ చేసి నెగ్గింది. పడిక్కల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

దూబే.. ఓకే
 రాజస్తాన్‌‌ ఓపెనర్లు బట్లర్‌‌ (8), వోహ్రా (7) బలమైన ఆరంభాన్నివ్వలేదు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన బట్లర్‌‌.. థర్డ్‌‌ ఓవర్‌‌లోనే ఔట్‌‌కాగా, ఒకే ఒక్క బౌండ్రీ సాధించిన వోహ్రా నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. కానీ సిరాజ్‌‌ (3/27) తన థర్డ్‌‌ ఓవర్‌‌లో మిల్లర్‌‌ (0)ను కూడా పెవిలియన్‌‌కు పంపడంతో రాజస్తాన్‌‌ 18/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో శాంసన్‌‌ (21) విఫలమైనా.. దూబే  కీలక ఇన్నింగ్స్‌‌ ఆడాడు. పవర్‌‌ప్లేలో 32/3 స్కోరు మాత్రమే చేసిన రాయల్స్‌‌కు.. ఎనిమిదో  ఓవర్‌‌లో గట్టి దెబ్బ తగిలింది. సుందర్‌‌ బాల్‌‌ను భారీ సిక్సర్‌‌గా మలిచిన శాంసన్‌‌.. సెకండ్‌‌ బాల్‌‌కు మిడ్‌‌ వికెట్‌‌లో మ్యాక్స్‌‌వెల్‌‌కు దొరికాడు. రియాన్‌‌ పరాగ్‌‌ (25) తో కలిసి దూబే ఇన్నింగ్స్‌‌ నడిపించాడు. చహల్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్‌‌లో రెండు సిక్సర్లు కొట్టిన దూబే.. 10 ఓవర్లలో టీమ్‌‌ స్కోరును 70/4కు పెంచాడు. తర్వాతి ఓవర్‌‌లోనూ మరో రెండు ఫోర్లు కొట్టడంతో 11 రన్స్‌‌ వచ్చాయి. 12వ ఓవర్‌‌లో పరాగ్‌‌ రెండు బౌండ్రీలు, దూబే ఓ ఫోర్‌‌ కొట్టి 15 రన్స్‌‌ రాబట్టారు. అయితే, 14వ ఓవర్‌‌లో పరాగ్‌‌ను ఔట్‌‌ చేసిన హర్షల్‌‌ (3/47) ఫిఫ్త్‌‌ వికెట్‌‌కు 66 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌కు ముగింపు పలికాడు. భారీ హిట్టర్‌‌  తెవాటియా  వచ్చీ రావడంతోనే అటాకింగ్‌‌ మొదలుపెట్టాడు. తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్స్‌‌ సిక్స్‌‌, ఫోర్‌‌తో ఖాతా తెరిచాడు. అయితే 16వ ఓవర్‌‌లో దూబే ఔట్‌‌కావడంతో రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌‌ మళ్లీ తడబడింది. మోరిస్‌‌ (10) సిక్సర్‌‌తో టచ్‌‌లోకి వచ్చినా.. ఎక్కువసేపు నిలబడలేదు. సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో సిక్సర్‌‌ కొట్టిన తెవాటియా 19వ ఓవర్‌‌లో పెవిలియన్‌‌కు చేరడంతో ఏడో వికెట్‌‌కు 37 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. లాస్ట్‌‌ ఓవర్‌‌లో హర్షల్‌‌.. మోరిస్‌‌, సకారియా (0)ను ఔట్‌‌ చేసినా శ్రేయస్‌‌ గోపాల్‌‌ (7 నాటౌట్‌‌) సిక్సర్‌‌ కొట్టడంతో మంచి టార్గెట్‌‌ వచ్చింది.  
ఇద్దరూ.. ఇద్దరే
భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బెంగళూరు ఇన్నింగ్స్‌‌ను పడిక్కల్‌‌, కోహ్లీయే నడిపించారు. రాజస్తాన్‌‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. ఒక్క క్యాచ్‌‌ చాన్స్‌‌ ఇవ్వకుండా సూపర్‌‌ బ్యాటింగ్​తో చెలరేగిపోయారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో రన్‌‌రేట్‌‌ వాయువేగంతో దూసుకుపోయింది. థర్డ్‌‌ ఓవర్‌‌లో రెండు ఫోర్లు, నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టిన పడిక్కల్‌‌.. ఐదో ఓవర్‌‌లో ఏకంగా సిక్స్‌‌, ఫోర్‌‌ బాదేశాడు. ఆ వెంటనే మరో సిక్సర్‌‌ కొట్టడంతో పవర్‌‌ప్లేలో ఆర్‌‌సీబీ 59/0 స్కోరుతో నిలిచింది. ఇక ఇక్కడి నుంచి పడిక్కల్‌‌ ఆట మరో మెట్టు ఎక్కింది. 8వ ఓవర్‌‌లో పరాగ్‌‌ బాల్‌‌ను రోప్‌‌ దాటించి 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. ఇదే ఓవర్‌‌లో మరో సిక్సర్‌‌, తర్వాతి ఓవర్‌‌లో రెండు సిక్సర్లు, 10వ ఓవర్‌‌లో మరో సిక్సర్‌‌ కొట్టడంతో ఆర్‌‌సీబీ 107 రన్స్‌‌ చేసింది. 11వ ఓవర్‌‌ నుంచి కోహ్లీ జోరందుకున్నాడు. 12వ ఓవర్​లో 2 ఫోర్లు కొట్టిన విరాట్‌‌.. 43 రన్స్‌‌ వద్ద మోరిస్‌‌ బాల్‌‌ను స్టాండ్స్‌‌లోకి పంపి హాఫ్‌‌ సెంచరీ (34 బాల్స్‌‌) పూర్తి చేశాడు. ఆ వెంటనే మరో రెండు, ఫోర్లు, ఓ సిక్స్‌‌ బాదేశాడు. ఈ జోడీని విడదీసేందుకు శాంసన్‌‌ బౌలర్లను మార్చినా ప్రయోజనం లభించలేదు. 15వ ఓవర్‌‌లో ముస్తాఫిజుర్‌‌ 3 రన్సే ఇవ్వడంతో స్కోరు 162/0కు పెరిగింది. 16వ ఓవర్‌‌లో సకారియా బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టిన పడిక్కల్‌‌.. తర్వాతి ఓవర్‌‌లో ముస్తాఫిజుర్‌‌ బాల్‌‌ను ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో ఫోర్‌‌గా మలిచి ఐపీఎల్‌‌లో ఫస్ట్‌‌ సెంచరీ (51 బాల్స్‌‌) సెంచరీని అందుకున్నాడు. 

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
రాజస్తాన్‌‌: బట్లర్‌‌ (సి) సిరాజ్‌‌ 8, వోహ్రా (సి) రిచర్డ్‌‌సన్‌‌ (బి) జెమీసన్‌‌ 7, శాంసన్‌‌ (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) సుందర్‌‌ 21, మిల్లర్‌‌ (ఎల్బీ) సిరాజ్‌‌ 0, దూబే (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) రిచర్డ్‌‌సన్‌‌ 46, పరాగ్‌‌ (సి) చహల్‌‌ (బి) పటేల్‌‌ 25, తెవాటియా (సి) షాబాజ్‌‌ (బి) సిరాజ్‌‌ 40, మోరిస్‌‌ (సి) చహల్‌‌ (బి) పటేల్‌‌ 10, శ్రేయస్‌‌ గోపాల్‌‌ (నాటౌట్‌‌) 7, సకారియా (సి) డివిలియర్స్‌‌ (బి) పటేల్‌‌ 0, ముస్తాఫిజుర్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 177/9. వికెట్లపతనం: 1–14, 2–16, 3–18, 4–43, 5–109, 6–133, 7–170, 8–170, 9–170. బౌలింగ్‌‌: సిరాజ్‌‌ 4–0–27–3, జెమీసన్‌‌ 4–0–28–1, రిచర్డ్‌‌సన్‌‌ 3–0–29–1, చహల్‌‌ 2–0–18–0, సుందర్‌‌ 3–0–23–1, హర్షల్‌‌ పటేల్‌‌ 4–0–47–3. 
బెంగళూరు: కోహ్లీ (నాటౌట్‌‌) 72, పడిక్కల్‌‌ (నాటౌట్‌‌) 101, ఎక్స్‌‌ట్రాలు: 8, మొత్తం: 16.3 ఓవర్లలో 181/0. బౌలింగ్‌‌: శ్రేయస్‌‌ గోపాల్‌‌ 3–0–35–0, సకారియా 4–0–35–0, మోరిస్‌‌ 3–0–38–0, ముస్తాఫిజుర్‌‌ 3.3–0–34–0, తెవాటియా 2–0–23–0, పరాగ్‌‌ 1–0–14–0.