
సిగరెట్ తాగడం వల్ల శరీరం పై ప్రభావం పడుతుందని మనందరికీ తెలుసు, ముఖ్యంగా ఊపిరితిత్తులకు ధూమపానం చాల హానికరం. అయితే, కేవలం పొగ తాగడం మాత్రమే కాదు కొన్ని ఇతర అలవాట్లు కూడా మన శ్వాస వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
గాలి కాలుష్యం: గాలి కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులకు చాలా నష్టం కలుగుతుంది. కలుషితమైన వాతావరణంలో ఉండటం, హానికరమైన గాలి పీల్చడం వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఒకే చోట కూర్చోవడం: ఎక్కువగా కూర్చోవడం వల్ల శ్వాసకు ఉపయోగపడే కండరాలతో సహా శరీరం మొత్తం కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది త్వరగా అలసిపోతారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఇంకా COPD వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
మైనింగ్/ గనులు, నిర్మాణ పనులు చేసే వారికి ఊపిరితిత్తుల ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వారు హానికరమైన పొగ, దుమ్ము, రసాయనాలు పీల్చుకోవల్సి వస్తుంది. ఇందుకు సరైన రక్షణ లేకపోవడం వల్ల బొగ్గు, సిలికా వంటి సూక్ష్మ కణాలను పీల్చుకోవడంతో అవి శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల న్యుమోకోనియోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. అలాగే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది.
మద్యం: ఎక్కువగా మద్యం తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులతో సహా శరీరం మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఆహారం: మన ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, మంచి కొవ్వు, ప్రోటీన్లు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్, వేయించినవి, ఎక్కువ ఉప్పు, చక్కెర పదార్థాలను తగ్గించడం మంచిది.
ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం రోజుకు 6 నుండి 8 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. సరైన పద్దతిలో కూర్చోవడం కూడా అవసరం. వంగి కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులకు శ్వాస పూర్తిగా అందదు. నిలువుగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు మంచిది.