భద్రాచలం ఈవోపై దాడి.. భూ ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన రమాదేవి

భద్రాచలం ఈవోపై దాడి.. భూ ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన రమాదేవి
  • ఏపీలోని పురుషోత్తమపట్నంలో ఉద్రిక్తత
  • ఆలయ సిబ్బంది, ఈవోను చుట్టుముట్టి ఘెరావ్
  • హైకోర్టు తీర్పు కాపీలు గుంజుకుని తోసేసిన గ్రామస్తులు
  • స్పృహ తప్పి పడిపోయిన ఈవో.. హాస్పిటల్​కు తరలింపు
  • మరో ఆలయ ఉద్యోగిపై పిడిగుద్దులు
  • ఈవోను ఫోన్​లో పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

భద్రాచలం/హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి రాములోరి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, ఎస్పీఎఫ్ జవాన్లను అడ్డుకున్నారు. అందరినీ చుట్టుముట్టి ఘర్షణకు దిగారు. ఒకర్ని ఒకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలయ ఉద్యోగి వినీల్ ఛాతిపై ఆక్రమణదారులు పిడిగుద్దులు గుద్దారు. ఈ క్రమంలోనే ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆలయ సిబ్బంది ఈవోను భద్రాచలంలోని కిమ్స్ హాస్పిటల్​కు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వినీల్​కు చికిత్స అందిస్తున్నారు.

ఇద్దరి హెల్త్ కండీషన్ బాగుందని డాక్టర్లు తెలిపారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆర్డీవో దామోదర్ రావు హాస్పిటల్ వెళ్లి ఈవోను పరామర్శించారు. దాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. కాగా, ఈవోపై దాడి ఘటనలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆలయ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తనపై ఆలయ సిబ్బంది దాడి చేశారంటూ‌‌‌‌‌‌‌‌ పున్నమ్మ అనే మహిళ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఎటపాక మండలం పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. 

పురుషోత్తపట్నంలోనే 889.50 ఎకరాలు
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి చెందిన 889.50 ఎకరాల భూమి ఉంది. చాలా కాలంగా ఇది ఆక్రమణలకు గురవుతున్నది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ, పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఆలయ భూములను కబ్జా చేస్తున్నారు. ఏకంగా పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. దీనిపై సోమవారం కూడా ఆలయ సిబ్బంది గ్రామానికి వెళ్లింది. ఆలయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోరింది. ఇది వినిపించుకోని గ్రామస్తులు.. ఆలయ సిబ్బందిని అడ్డుకున్నారు. ఆలయ భూములు కావని, అవన్నీ తమ భూములే అని వాదించారు. ఈ విషయాన్ని సిబ్బంది ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె.. తన సిబ్బంది, ఉద్యోగులు, ఎస్​పీఎఫ్ జవాన్లతో కలిసి మంగళవారం పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లారు. 

ఆలయానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను గ్రామస్తులకు చూపించారు. హైకోర్టు ఉత్తర్వులను అతిక్రమించొద్దని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆలయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని సూచించారు. ఇది వినిపించుకోని గ్రామస్తులు.. ఈవో రమాదేవి, ఉద్యోగులు, సిబ్బందిని చుట్టుముట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈవో చేతిలో ఉన్న కాగితాలను గుంజుకున్నారు. ఆక్రమణ స్థలం నుంచి తోసుకుంటూ రోడ్డు వరకు తీసుకెళ్లారు. తోపులాటలో ఈవో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. వినీల్ అనే ఉద్యోగి ఛాతిపై గ్రామస్తులు బలంగా కొట్టారు. దీంతో ఇద్దరినీ కిమ్స్ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కబ్జా చేస్తే పీడియాక్ట్: కొండా సురేఖ
ఆలయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడ్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. భద్రాచలం ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని కోరారు. ఏపీలో ఉన్న భద్రాద్రి ఆలయానికి సంబంధించిన భూముల్లోని ఆక్రమణలను తొలగించాలన్నారు. 
ఈవో రమాదేవితో మంత్రి కొండా సురేఖ ఫోన్​లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్ కండీషన్​పై ఆరా తీశారు. డిపార్ట్​మెంట్ నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కాగా, భద్రాద్రి రాములోరికి ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 1,300 ఎకరాల భూమి ఉంది. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నంలోనే 889.5‌‌‌‌‌‌‌‌0 ఎకరాలు ఉన్నది. ఇక్కడున్న భూమిలో చాలా వరకు ఆక్రమణకు గురైంది.

దాడి చేసినోళ్లపై కేసు పెట్టాలి
భద్రాచలం ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రకటించింది. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, జనరల్ సెక్రటరీ భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్​తో మాట్లాడినట్లు వివరించారు. ఈవో రమాదేవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

ఈవోపై దాడిని ఖండించిన ఆలయ ఉద్యోగులు
భద్రాచలం ఈవో రమాదేవిపై దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ టీడీపీ నాయకుడు కొడాలి శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఆలయ భూములు కబ్జా చేయడమే కాకుండా.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉద్యోగుల యూనియన్ లీడర్లు శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఈవోపై దాడిని తీవ్రంగా ఖండించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈవోపై దాడి దురదృష్టకరం: మంత్రి తుమ్మల
భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై దాడి దురదృష్టకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే మంత్రి ఈవోకు కాల్ మాట్లాడారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. భూముల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. భూములు దేవస్థానం పరిధిలో ఉంటేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని అన్నారు.