రైల్వే ట్రాక్ పై నాటు బాంబులు

రైల్వే ట్రాక్ పై  నాటు బాంబులు
  • ఒకదాన్ని కొరకడంతో పేలుడు ధాటికి కుక్క మృతి
  • భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్​లో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్​లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే ట్రాక్​పై పడి ఉన్న అండర్ వేర్​లో 6 నాటు బాంబులు గుర్తించారు. అటుగా వెళ్తున్న కుక్క.. వాటిలో ఒకదాన్ని కొరికింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కుక్క చనిపోయింది. ఈ శబ్ధం విన్న రైల్వే స్టేషన్​లోని సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. 

అనంతరం కొత్తగూడెం త్రీటౌన్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శివప్రసాద్ స్పాట్​కు చేరుకుని విచారణ చేపట్టారు. బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. పేలుడు సంభవించిన ట్రాక్ పైనుంచి రోజూ గూడ్స్ తో పాటు ప్యాసింజర్ రైళ్లు వెళ్తుంటాయి. ట్రాక్​పై నాటు బాంబులు ఎవరువదిలి వెళ్లారనే దానిపై విచారణ చేపట్టారు. అడవుల్లో వేటకు, చేపల చెరువుల్లోనూ ఈ బాంబులను వినియోగిస్తుంటారని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటన వెనుక కుట్ర దాగుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.