- ఫ్యామిలీ కౌన్సిలింగ్‌తో విభేదాలు దూరం
- ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, షీటీమ్ ప్రత్యేక కార్యక్రమం
- విజయవంతమవుతున్న ‘వెలగనిద్దాం దాంపత్య దీపం దేదీప్యంగా’ ప్రోగ్రాం
- ఒకే వేదికపై కలిసి అనుభవాలు పంచుకున్న దంపతులు
- విడిపోయిన నరకం అనుభవించామని ఆవేదన
నిర్మల్, వెలుగు: చిన్నచిన్న భేదాభిప్రాయాలు, మనస్పర్థల కారణంగా విడిపోతున్న దంపతులను నిర్మల్ జిల్లా పోలీసులు మళ్లీ కలుపుతున్నారు. కౌన్సెలింగ్‌లు, అవగాహన, కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను వివరిస్తూ వారిని ఏకం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన షీటీమ్ భరోసా కౌన్సెలింగ్ సెంటర్ విడిపోయిన కుటుంబాలను చేరదీసి వారికి పూర్వ జీవితం కల్పిస్తోంది. ‘వెలగనిద్దాం దాంపత్య జీవితం దేదీప్యమానంగా’ అనే ట్యాగ్ లైన్ తో నిర్మల్ పోలీసులు కౌన్సెలింగ్ఇస్తూ ఆరు నెలల కాలంగా 110 జంటలను ఏకం చేశారు.
సక్సెస్ ఫుల్ భరోసా..
చిన్నచిన్న మనస్పర్థలు, భేదాభిప్రాయాలతో విడిపోయిన దంపతులకు నిర్మత్తోపాటు భైంసా డివిజన్ కేంద్రంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. భర్తపై భార్య, భార్యపై భర్త గాని జిల్లాలోని ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగానే.. ఆ ఫిర్యాదును పోలీసులు మొదట భరోసా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. భరోసా కేంద్రం సిబ్బందికి షీ టీమ్ కూడా తోడవుతోంది. వీరంతా కలిసి బాధితులను, ఫిర్యాదుదారులను భరోసా కేంద్రానికి పిలిపించి వారితో చర్చిస్తున్నారు.
ఈ టీమ్‌లో ఫ్యామిలీ కౌన్సిలర్, సైకియాట్రిస్ట్, ఎస్సై, అడ్వకేట్ తోపాటు మరికొంత మంది సిబ్బంది ఉంటున్నారు. మొదట భార్యాభర్తలతో వేర్వేరుగా చర్చించి వారు దూరమవ్వడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి వారికి కౌన్సెలింగ్ ఇస్తూ దాంపత్య జీవితంలోని మంచి చెడులు, క్షణికావేశాల తీవ్రతను వివరిస్తు న్నారు. విడిపోతే జరిగే నష్టాల గురించి చెబుతూ.. పిల్లల జీవితాలను నాశనం చేయొద్దని సూచిస్తున్నారు. కాంప్రమైజ్కాకపోతే మూడు నాలుగు సిట్టింగులతో కౌన్సెలింగ్ జరిపి వారిని తిరిగి దాంపత్య జీవితం వైపు మళ్లిస్తున్నారు.
పరస్పర అవగాహన చర్చలు, కౌన్సెలింగ్‌తో ఆరు నెలల వ్యవధిలో 110 మంది దంపతులను ఏకం చేశారు. కౌన్సెలింగ్‌లో ఏకమైన దంపతుల అనుభవాలను వెల్లడించేందుకు బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్పీ జానకీ షర్మిలతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి హాజరై బాధిత దంపతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కన్నీటి పర్యంతమై తాము విడిపోయి అనుభవించిన కష్టాలను వివరించారు.
క్షణికావేశంలో మనస్పర్థలతో విడిపోయి తీవ్ర మనోవేదన అనుభవించామని బోరుమన్నారు. పోలీసుల కౌన్సెలింగ్‌తో తాము ప్రస్తుతం ఒక్కటై సుఖ సంతోషాలతో జీవిస్తున్నామన్నారు. చిన్నచిన్న అభిప్రాయభేదాలు, మనస్పర్థలు వచ్చినా వాటిని స్వయంగా పరిష్కరించుకుంటున్నామన్నారు. తమకు భరోసా సభ్యుల సూచనలు జీవితంలో మరిచిపోలేని, కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆనందం వ్యక్తం చేశారు.
మహిళల సంరక్షణకే భరోసా కేంద్రాలు
మహిళల సంరక్షణ కోసమే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. చిన్నచిన్న కుటుంబ తగాదాలతో విడిపోయిన దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒకటి చేస్తున్నాం. పోలీసు శాఖ నిర్మల్, బైంసా కేంద్రాల్లో భరోసా కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తూ విడిపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం. మానసిక ఒత్తిడి, విధుల ఒత్తిడితోపాటు కుటుంబ వ్యవహారాల కారణంగా చాలామంది దంపతులు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి దాంపత్య జీవితం మాధుర్యాన్ని వివరిస్తూ భరోసా కేంద్రాలు వారిని ఒకటి చేస్తున్నాయి.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్
