బుల్లితెర రియాలటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. దీంతో హౌస్ లో కంటెస్టెంట్ మధ్య ఆట తీరు ఉత్కంఠభరితంగా మారుతోంది. 14 వారం ఊహించని టాస్క్ లతో బిగ్ బాస్ మరింత ఆకట్టుకుంటోంది. రీతూ చౌదరి ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి కళ్యాణ్ ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా నిలవగా.. మిగిలిన ఆరుగురు టాప్ 5లో ఉండేందుకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఈ వారం ఆటను బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మార్చేశాడు. హౌస్‌మేట్స్‌కు 'లీడర్ బోర్డు'లో స్కోర్ పెంచుకునేందుకు, ఫైనలిస్ట్ అయ్యేందుకు కీలకమైన టాస్క్‌లు ఇస్తున్నాడు. ఈ రోజు (మంగళవారం) ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో చూస్తే.. హౌస్‌లో పెద్ద గొడవలకు దారితీసినట్లు స్పష్టమైంది. కంటెస్టెంట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రూపులుగా మారిపోయారు.
వీల్ బారో టాస్క్ లో బ్యాలెన్స్ తప్పితే అంతే!
ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌లకు 'వీల్ బారో' (తోపుడు బండి) టాస్క్‌ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఒక బండిని ఇచ్చి, దానిపై కుండలను ఒకదానిపై ఒకటి పడకుండా బ్యాలెన్స్ చేస్తూ గమ్యస్థానానికి చేరుకోవాలి. ఈ రేసులో ఎవరు ముందుగా చేరుకుంటే, వారు లీడర్ బోర్డులో స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్‌లో ఇమ్మానుయేల్ ఎప్పటిలాగే దూకుడుగా ఆడుతూ తన పట్టుదల ప్రదర్శించాడు.
ఇమ్ముకి షాక్!
వీల్ బారో టాస్క్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌లకు ఒక మెలిక పెట్టాడు. తరువాత వచ్చే టాస్కులలో పాల్గొనకుండా చేయడానికి మీలో ఒక సభ్యుడిని ఎన్నుకోవాలి అని ఆదేశించాడు. మీరు ఎంపిక చేసిన సభ్యుడికి తరువాతి యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉండదు, కాబట్టి అతనికి సున్నా స్కోర్ మాత్రమే లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్పడంతో, హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర చర్చ మొదలైంది. ఈ సందర్భంగా తనూజ తన డ్యూటీని మొదలుపెట్టింది. ఆట నుంచి ఇమ్మానుయేల్‌ను తప్పించాలని భావించి, సంజనాతో "ఇమ్మానుయేల్ పేరు చెప్పు" అని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి సంజన నేరుగా వెళ్లి ఇమ్మానుయేల్‌తో చెప్పేయడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. మీ కత్తి ఆపుకున్నప్పుడు వేరే వాళ్ల కత్తి వచ్చి నాకు తగులుతుంది అంటూ ఇమ్మానుయేల్ సంజనకు హితబోధ చేశాడు.
కొట్టేంత పని చేసిన భరణి.
గొడవ మరింత ముదరడానికి కారణం సంజన. ఈ చర్చ జరుగుతుండగా, సంజన భరణి దగ్గరకు వెళ్లి, భరణిని ఆట నుంచి తీసేయాలని ఇమ్మానుయేల్ ఆలోచిస్తున్నాడు అని తప్పుడు సమాచారం అందించింది. ఆ మాట వినగానే ఇమ్మానుయేల్ షాక్ అవుతాడు. అన్నా నేను మీ పేరు తీయలేదు. మిమ్మల్ని టార్గెట్ చేయడం లేదు అని ఇమ్మానుయేల్ ఎంత క్లారిటీ ఇచ్చినా, భరణి మాత్రం లేదు నా పేరే వచ్చింది అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. కోపంతో భరణి ఇమ్మానుయేల్‌ను కొట్టేలా వేగంగా అతని దగ్గరకు దూసుకురావడంతో, ఇమ్మానుయేల్ భయపడి వెనకడుగు వేశాడు. మీరు నలుగురూ ఒక్కటయ్యారు.. నన్ను తప్పించాలని చూస్తే నాకెలా ఉంటుంది అంటూ భరణి వాదించడం.. దానికి ఇమ్మానుయేల్ వివరణ ఇచ్చుకోవడం వచ్చింది. మొత్తానికి తనూజ మాస్టర్ స్ట్రోక్ కారణంగా హౌస్‌లో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది.

