
- 129 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్ లోని నితీశ్ కుమార్ప్రభుత్వం ఏఎన్ఎంల గౌరవ వేతనాన్ని పెంచింది. అలాగే, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను డబుల్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంల గౌరవ వేతనాన్ని రూ.11,500 నుంచి రూ.15 వేలకు పెంచింది. అలాగే, 9, 10 తరగతుల విద్యార్థులకు వార్షిక స్కాలర్‌షిప్‌ను రూ.3,600 కు పెంచినట్టు అడిషనల్సీఎస్ అరవింద్ కుమార్ చౌదరి తెలిపారు.
సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం.. ఫిల్మ్ అండ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు సహా మొత్తం 129 ప్రతిపాదనలను ఆమోదించింది. ముఖ్యమంత్రి బాలక్/బాలికా స్కాలర్‌షిప్ పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన 9, 10 తరగతుల విద్యార్థులకు (మైనారిటీలతో సహా) వార్షిక స్కాలర్‌షిప్‌ను పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ మొత్తాన్ని ఒక్కో విద్యార్థికి రూ.1,800 నుంచి రూ.3,600కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.99.21 కోట్ల అదనపు భారం పడుతుందని ఏసీఎస్ చెప్పారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పాట్నాలోని బంకిపూర్ బస్టాండ్ వద్ద 3.24 ఎకరాల భూమిలో నిర్మించనున్న ఫైవ్‌స్టార్ హోటల్‌కు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. మహిళల భద్రత, పునరావాసం కోసం ముఖ్యమంత్రి నారీ శక్తి యోజన కింద ఉన్న షార్ట్-స్టే హోమ్‌లను శక్తి సదన్ కేంద్రాలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.
పెన్షనర్ల యాన్యువల్లైఫ్సర్టిఫికెట్కోసం కామన్ సర్వీస్ సెంటర్ ఈ -గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌ను కేబినెట్ ఎంపిక చేసిందని ఏసీఎస్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే శుక్రవారం బిహార్ ప్రభుత్వం.. ఉద్యోగులు డీఏ, పెన్షనర్లకు డీఆర్3 శాతం ప్రకటించింది. దీపావళి, ఛత్‌కు ముందు దీనిని 55 శాతం నుంచి 58 శాతానికి పెంచింది.