దేవాలయాల భూమి కబ్జా చేశారని ధర్నా : బిజిలీపూర్​ గ్రామస్తులు

దేవాలయాల భూమి కబ్జా చేశారని ధర్నా : బిజిలీపూర్​ గ్రామస్తులు

శివ్వంపేట, వెలుగు: దేవాలయాలకు చెందిన భూమిని రియల్​ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారంటూ మండల పరిధిలోని బిజిలీపూర్​ గ్రామస్తులు గురువారం తహసీల్దార్​ ఆఫీస్​ ముందు ధర్నా చేశారు. గ్రామంలో 500 ఏళ్ల చరిత్ర గల దుర్గమ్మ, లింగమయ్య, మాత పోచమ్మ దేవాలయాలకు వెళ్లే దారిని, ముందున్న స్థలాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా  చేస్తోందని ఆరోపించారు.

గ్రామంలో తాగునీటి సరఫరా చేసే  రెండు ట్యాంకుల స్థలం, పాత రికార్డులు సృష్టించి దుర్గమ్మ ఆలయ స్థలాన్నిరిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.  అనంతరం ఆలయాల స్థలాన్ని కాపాడాలని  తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో కూడా ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాదారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కొడతాం, చంపేస్తామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ తోపాటు, కలెక్టర్​కు, ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు.