
- రాష్ట్రపతి అపాయింట్ మెంట్కు బీజేపీ అడ్డుపడుతున్నది
- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లులకు ఆమోదం దక్కుతుందన్న అక్కసుతోనే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కు బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సహా మంత్రివర్గమంతా అపాయింట్ మెంట్ అడిగితే రాష్ట్రపతి ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రపతిని కలవకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ.. ఢిల్లీలో ఎందుకు అడ్డుకుంటున్నదో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణలో ఒక నీతి, ఢిల్లీలో మరో నీతి.. ఇదేం ద్వంద నీతి? అని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపుతూ బీసీలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ విషయంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు బీసీలపై వాళ్లకున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
రాష్ట్రపతిని కలవడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అడ్డుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమే అవుతుందన్నారు. సమస్యను వినాల్సిన అవసరం రాష్ట్రపతికి కూడా ఉందన్నారు. 1971 నుంచే ముస్లింలకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, ఇది మతపరమైన రిజర్వేషన్ కాదని, ఇది సామాజిక న్యాయం కోసం జరిపే పోరాటమని తెలిపారు.