- నివాళులర్పించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
- పాడె మోసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
దిల్సుఖ్ నగర్, వెలుగు: చంపాపేట డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ మధుసూదన్ రెడ్డి (55) శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా నానక్ రామ్ గూడలోని స్టార్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య పద్మజ, కొడుకు సిద్ధాంత రెడ్డి, కుమార్తె స్నిగ్థ ఉన్నారు. 2001లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ నుంచి భారీ మెజారిటీతో చంపాపేట కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
ఘన నివాళులుఆయన భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్థం కర్మన్ ఘాట్‌లోని నివాసంలో ఉంచగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు నివాళులర్పించారు.
మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పాడె మోశారు. భూపేశ్ గుప్తానగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మధుసూదన్ మృతికి సంతాపంగా కర్మన్ ఘాట్ ప్రాంతంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
