
- ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో జోష్
- మెజారిటీ స్థానాల్లో పోటీకి కసరత్తు
- సమర్థులైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి
మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదివరకు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. బీజేపీ కేవలం కొన్ని స్థానాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి స్థానిక ఎన్నికల్లో బీజేపీ సైతం ప్రధాన పోటీదారుగా బరిలో నిలవనుంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడం, కొన్ని నెలల కింద జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపొండడంతో ఆ పార్టీ క్యాడర్ లో జోష్ వచ్చింది.
ఈసారి జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు ఈసారి స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు.
పల్లెల్లోనూ ఓట్లు పడడంతో..
బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పట్టు ఉంటుందన్న అభిప్రాయం ఉండేది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల సరళి ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేశాయి. ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావుకు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీకి మెజారిటీ ఓట్లు వచ్చాయి. దీంతో పల్లెల్లో సైతం తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని బీజేపీ భావిస్తోంది.
కేంద్ర పథకాలపై ప్రకారం..
స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించింది. బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆయా చోట్ల పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. నేషనల్ హైవేలు, రైల్వే సౌకర్యాల మెరుగు, స్టేషన్ల ఆధునికీకరణకు, అవసరం ఉన్న ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, బైపాస్ సర్కిళ్ల వద్ద పెద్ద హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి మొత్తంలో నిధులు మంజూరు చేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఎంపీ లాడ్స్ నిధులతో గ్రామాల్లో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేస్తూ స్తానిక ఎనికల్లో బీజేపీని ఆదరించాలని కోరుతున్నారు.