ఏడాదికి 35వేల కోట్ల వడ్డీ కట్టేలా చేశారు

ఏడాదికి 35వేల కోట్ల వడ్డీ కట్టేలా చేశారు
  • ఏడేళ్లలో రూ.4.25 లక్షల కోట్లు అప్పులు చేశారు
  • టీఆర్ఎస్ పాలనపై బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 

కరీంగనర్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఏడేళ్లలో 4.25 లక్షల కోట్లు అప్పులు చేసి తీవ్ర రుణభారం మోపారని.. ఏడాదికి వడ్డీనే రూ.35 వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని హుజురాబాద్ బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన వెంటనే దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి దళితులను ఏడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నాడని.. సీఎం పదవే కాదు.. పేదలకు మూడెకరల పొలం ఇచ్చే విషయాన్ని మర్చిపోయి దళితులకు తీరని నమ్మక ద్రోహం చేశాడని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఇన్నేళ్లుగా దళితులను మోసం చేసిన సీఎం.. ఇప్పుడు సీఎం దళిత సాధికారత పేరుతో మరోసారి మోసం చేస్తున్నాడని.. ఇప్పుడు పది లక్షలు ఇస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. 
పుట్టిన పసికందులపై కూడా అప్పుల భారం
మిగులుబడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 4.25 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఏడాదికి వడ్డీ రూపంలోనే 35 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని, ఈ వడ్డీ భారమంతా తెలంగాణలోని పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరిపై పడుతోందన్నారు. లక్ష కోట్లు కాళేశ్వరం కోసం ఖర్చు చేస్తే మిగతా మూడున్నర లక్షల కోట్లు ఏం చేశావని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరమైనా సాగవుతుందా అని ఆయన నిలదీశారు. దక్షిణ తెలంగాణ ఎడారిలా మారకుండా 32 వేల కోట్లతో పాలమూరు ప్రాజెక్టు కట్టి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఇంత వరకు పనే మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అమృత్, స్మార్ట్ సిటీ, ఇందిరా ఆవాస్ యోజన లాంటివన్నీ కేంద్రం ఇచ్చినవేనని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. 
కేసీఆర్ చెప్పే అబద్దాలు ఇక ప్రజలు నమ్మబోరు
కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు ఇకపై నమ్మబోరని.. హుజురాబాద్ లో ఎక్కడికెళ్లినా ప్రజలంతా ఈటలతోనే ఉన్నామని చెబుతున్నారని బీజేపీ నేత జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టడానికి అనేక అబద్దాలాడుతున్నాడని.. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ పూర్తైనా దాన్ని ఓపెనింగ్ చేయకుండా.. జైలును కూలగొట్టి 33 అంతస్థుల కొత్త ఆస్పత్రి కడుతానని చెబుతున్నాడని విమర్శించారు. 
చింతమడకలో ఇంటికి పది లక్షలు ఇస్తానని.. పైసా ఇవ్వలేదు
చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి అక్కడ ఎవరికీ ఒక్క పైసా ఇవ్వలేదని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి చింతమడకలో పాత ఇళ్లు కూలగొట్టుకున్న ప్రజలు బాధడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న గొర్రెలన్నీ ఇక్కడిక్కడే రీ సైక్లింగ్ చేస్తున్నారని, చేపలను దుబాయ్ కు ఎగుమతి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అలాంటి మాటలకు ఆధారం ఒక్కటైనా చూపగలరా?అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరి జీవితాలు బాగు పడలేదని జితేందర్ రెడ్డి విమర్శించారు.