నత్తనడకన లప్పనాయక్ తండా లేఔట్ పనులు

నత్తనడకన లప్పనాయక్ తండా లేఔట్ పనులు
  • బీజేపీ లీడర్లు,  నిర్వాసితుల నిరసన

యాదగిరిగుట్ట, వెలుగు : బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామ నిర్వాసితుల పునరావాసం కోసం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి శివారులోని సర్వే నంబర్ 294లో జరుగుతున్న లప్పనాయక్ తండా లేఔట్ పనులు నత్తనకడన కొనసాగుతున్నాయని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీరా కిషన్ నాయక్ ఆధ్వర్యంలో లప్పనాయక్ తండా నిర్వాసితులు లేఔట్ పనులను పరిశీలించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రూ.30 కోట్లతో 30 ఎకరాల్లో చేపట్టే లప్పనాయక్ తండా నూతన లేఔట్ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. మొదట హడావుడిగా పనులు ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్, తర్వాత పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. 

లేఔట్ కాంట్రాక్ట్ లో భాగంగా 30 ఎకరాల ల్యాండ్ ను చదును చేసి రోడ్లు, వాటర్ ట్యాంక్ సహా తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా, కేవలం చదును చేసి తూతూ మంత్రంగా రోడ్లు వేసి బిల్లులు పొందారని మండిపడ్డారు.

పనులు మొదలై దాదాపుగా మూడేండ్లు గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పనులు పూర్తిగా చేయకున్నా దాదాపుగా 90 శాతం బిల్లులు పొందారని ఆరోపించారు. నిలిచిపోయిన పనులను కాంట్రాక్టర్ తో వెంటనే మొదలుపెట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే నిర్వాసితులతో కలిసి బీజేపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.