ఈడీని వాడితే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మిగలరు

ఈడీని వాడితే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మిగలరు

యాదాద్రి భువనగిరి: ఈడీని వాడుకోవాలని చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే గెలిచే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో తప్పుకున్నాయని ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేమన్న సంజయ్... వాళ్లు కూడా మునుగోడు వదిలి వెళ్లకతప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని  కోల్పొయిందన్న ఆయన... దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న ఆయన... దుబ్బాక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారే తప్ప... ఏనాడు కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా మాట్లాడలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు లైసెన్సుడ్ గూండాలు అయిపోయారని పేర్కొన్నారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్ళీ వచ్చిందా అని అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనతో టచ్ లో ఉన్నారని తాను ఏనాడు అనలేదని, ఆయన మంచి లీడర్ అని మాత్రమే చెప్పానని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తోన్న అధికారుల లిస్ట్ రెడీ చేస్తున్నామని,  తాము అధికారంలోకి రాగానే వాళ్ల సంగతి చెప్తామని బండి సంజయ్ వార్నింగ్‌ ఇచ్చారు.