
కోదాడ, వెలుగు : ప్రధాని మోడీ నేతృత్వంలో విద్య, వైద్యం , రక్షణ, ఆర్థిక, టెక్నాలజీ రంగాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి దశకు చేరి ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు పేర్కొన్నారు. 2047లోగా భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం కోదాడ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచందర్ రావును తన బాల్య మిత్రులు, పలు పార్టీలు, సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వాసినని, సొంతూరిపై మమకారంతోనే బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చానని తెలిపారు.
ఇక్కడి జ్ఞాపకాలు తనకెప్పుడూ మధురస్మృతులేనని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేండ్ల కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రాష్ట్రంలో 13 జాతీయ హైవేలను వందల కోట్లతో నిర్మించిందన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యం కోసం వేగంగా నడిచే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఎయిర్ పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించిందని తెలిపారు. రాజకీయ నేతలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు.
రాష్ట్రంలో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందని, స్థానిక సంస్థల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ ఎన్ వీ రాఘవరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి , నేతలు అక్కిరాజు యశ్వంత్, కనగాల వెంకటరామయ్య, జుట్టుకొండ సత్యనారాయణ తతదితరులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధుడు, సీపీఐ సీనియర్ నేత దొడ్డా నారాయణరావు తన జీవితాంతం పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని రామచందర్ రావు కొనియాడారు. చిలుకూరులో నారాయణరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.