
- అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేస్తం
- యూరియాపై మంత్రి తుమ్మల
- అవాస్తవాలు మాట్లాడుతున్నడు
- అర్హులైన పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వకపోతే మా పార్టీ చూస్తూ ఊరుకోదు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
వికారాబాద్, వెలుగు:వచ్చే ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని, అధికారంలోకి రాగానే వికారాబాద్‌జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రాచందర్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారు.
సూపర్‌స్పీడ్‌తో పని చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ర్టంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. రాష్ర్టంలో కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని, దీన్నిబట్టి రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అర్థం చేసుకోవచ్చన్నారు. డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ ఇంట్లో కూర్చుందని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తమ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చుకుంటోందని ఆరోపించారు.
అర్హులైన పేదలకు ఇవ్వకపోతే బీజేపీ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వర్షాల వల్ల నష్ట పోయిన రైతులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నష్ట వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. రాష్ర్ట రైతులకు అవసరమైన యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి పరుస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.రాజశేఖర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు కరుణం ప్రహ్లాద్‌రావు, టి.సదానంద్‌రెడ్డి, కె.మాధవరెడ్డి, లీడర్లు వడ్ల నందు, కె.శివరాజ్, యు.రమేష్‌కుమార్, పి.నవీన్‌కుమార్, మిట్ట పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.