- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవీలత
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రామునికి అంతర్జాతీయ ఖ్యాతి కోసం బీజేపీ కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవీలత అన్నారు. భద్రాచలంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనల మహాకూటమి సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్రనాయక్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. భద్రాచలంకు రెండు రైల్వే లైన్లు, ప్రసాద్ నిధులు ఇచ్చి కేంద్రంలోని బీజేపీ సర్కారు రామునిపై ఉన్న ప్రేమను చాటుకుందన్నారు.
గతంలో పదేండ్ల పాలించిన బీఆర్ఎస్ భద్రాద్రి రాముడిని విస్మరించిందని ఆరోపించారు. కనీసం కల్యాణ తలంబ్రాలు తేవడానికి కూడా కేసీఆర్ మనస్సు అంగీకరించలేదన్నారు. అటువంటి బీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రామాలయ అభివృద్ధికి ప్రకటించిన నిధుల్లో పైసా ఇవ్వని బీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు.
రూ.1028కోట్లు కేంద్రం నిధులు ఇస్తే రూ.612 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆమె ప్రశ్నించారు. బీజేపీ సర్కారు భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు ఎయిర్‌పోర్టును ప్రకటిస్తే కనీసం భూమిని కేటాయించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. పాండురంగాపురం-సారపాకల మధ్య రైల్వే లైను కోసం భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, రూ.3,592 కోట్లతో మోదీ సర్కారు మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు రైల్వే లైనును మంజూరు చేసిందని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రప్పించి, భద్రాచలంలో రూ.93కోట్లతో ప్రసాద్ స్కీం ద్వారా రామాలయం అభివృద్ధికి బీజేపీ సర్కారు కృషి చేస్తోందన్నారు. భద్రాచలం అభివృద్ధిలో కేవలం టీడీపీ సర్కారు కృషే ఉందని గుర్తు చేశారు. కరకట్ట, సెంట్రల్ లైటింగ్ సిస్టం, రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంలో ఏజెన్సీ అభివృద్ధికి టీడీపీ చేసిన పనులు మలుపు తిప్పాయని వివరించారు.అనంతరం భద్రాచలంలో ర్యాలీ నిర్వహించి మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
