- జీవో 27తో 9,292 ఎకరాలు దోచుకునేందుకు ప్లాన్: ఏలేటి
- హిల్ట్ పాలసీపై బీజేపీ స్టేట్ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కారు తెరలేపిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ‘హిల్ట్’పాలసీ పేరుతో రూ.6.29 లక్షల కోట్ల విలువైన 9,298 ఎకరాల భూములను కొట్టేసేందుకు సీఎం రేవంత్ ప్లాన్ వేశారన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో హిల్ట్ భూ కుంభకోణంపై ఏలేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నవంబర్ 22న గుట్టుచప్పుడు కాకుండా జీవో నంబర్ 27 తీసుకొచ్చారని, దీని ప్రకారం 22 ఎస్టేట్స్‌లోని 9,292 ఎకరాలను మల్టీ జోన్స్‌గా మారుస్తున్నారన్నారు. ఆయా ఎస్టేట్స్‌లోని కంపెనీలతో సీఎం అనుచరులు ముందే ఒప్పందాలు చేసుకున్నారని ఏలేటి ఆరోపించారు.
కొకాపేటలో ఎకరం రూ.137 కోట్లు.. ఇక్కడ ఫ్రీనా?
ఇటీవల ఓఆర్ఆర్ పరిధిలోని కొకాపేటలో ఎకరం రూ.137 కోట్లు పలికిందని, ఇప్పుడు ఈ 22 ఎస్టేట్స్‌లోని భూములను సగటున రూ.68 కోట్ల చొప్పున లెక్కేసినా దాని విలువ రూ.6.30 లక్షల కోట్లు దాటుతుందని చెప్పారు. ఇంత విలువైన ప్రజా ఆస్తిని మార్కెట్ రేటుకు కాకుండా, టీజీఐఐసీ రేట్లను కూడా లెక్కలోకి తీసుకోకుండా.. కేవలం ఎస్ఆర్వో వాల్యూలో 30 శాతానికే ఎట్లా కట్టబెడతారని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి పాలసీలే తెచ్చి వేల ఎకరాల భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, వాళ్లు దొంగలుగా మారితే.. వీళ్లు గజదొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు.
పొల్యూషన్ పేరు చెప్పి పారిశ్రామిక వాడలను తరలిస్తామంటున్నారని, మరి అక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీ చేశారా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా అక్కడ పేరుకుపోయిన వ్యర్థాలు, కలుషితమైన భూమిని రెసిడెన్షియల్ జోన్‌గా ఎట్లా మారుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సబ్ కమిటీ వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారని, ఆ కమిటీలో ఎవరెవరున్నారనే వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
