హర్యానాలోని ఓల్డ్ ఫరీదాబాద్‌కు చెందిన 19 ఏళ్ల బీ.కాం విద్యార్థి బ్లాక్‌మెయిలింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఫోన్ హ్యాక్ చేసి ఏఐ (artificial intelligence) సాయంతో ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వేధించడంతో ఈ దారుణం జరిగింది.
దాదాపు పది రోజుల క్రితం మెసేజింగ్ యాప్ ద్వారా ఈ వేధింపులు మొదలయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుల తమ వద్ద విద్యార్థితో పాటు అతని సోదరీమణుల డిజిటల్ మార్ఫ్ (డీప్‌ఫేక్) ఫోటోలు ఉన్నాయని బెదిరిస్తూ, ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకుండా ఉండాలంటే 20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసుల ప్రకారం, నిందితులు ఫోన్ హ్యాక్ చేసిన తర్వాతే ఈ మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి పంపారు. ఆ మెసేజులు రోజురోజుకూ మరింత బెదిరింపులకు దారితీశాయి. ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో తన గదిలో విషం తాగాడు. దింతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు.
పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా బాధితుడి ఫోన్, చాట్ హిస్టరీ, సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలిస్తున్నారు. అసలు నిందితులు అతని వ్యక్తిగత డేటాను ఎలా పొందారు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఎలా సృష్టించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు విద్యార్థి ఒంటరిగా, ఆందోళనగా కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీని ఆధారంగా ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
