రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారు:వినోద్ కుమార్

రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారు:వినోద్ కుమార్

రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియాతో పాటు ఇతర ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి ఏడాది క్రితమే ప్రారంభమైందన్నారు. అయితే ప్రధాని ఇప్పుడు  ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని రావడం సంతోషమే అని..అయితే ప్రధాని కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంతో గానీ ముఖ్యమంత్రితో గానీ సంప్రదింపులు జరపాలన్న కనీస పద్ధతులను కేంద్ర ప్రభుత్వం, పీఎంవో అనుసరించకపోవడం బాధాకరమన్నారు. 

ప్రొటోకాల్ పాటించరా...?

తెలంగాణలో పర్యటించే సందర్భంలో ప్రధాని మోడీ కావాలనే సీఎం కేసీఆర్ ను  నిరోధిస్తున్నారని  వినోద్ కుమార్ అన్నారు.  ఇది ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని చెప్పారు. గతంలో కరోనా సందర్భంగా భారత్ బయోటెక్ పరిశ్రమలో వ్యాక్సిన్స్ ఉత్పత్తి పరిశీలనకు వచ్చిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను నిరోధించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కావాలనే హాజరవడం లేదని  కొంతమంది పనికట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. ఈ ఎరువుల కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా చేస్తోందని తెలిపారు.

ప్రధానికి డిమాండ్లు..

రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు  రావాల్సిన  అన్ని జాతీయ రహదారులను ప్రకటించాలని  వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వయా భూపాలపల్లి మేడారం రైల్వే లైన్ ను ప్రకటించాలన్నారు. భద్రాచలం - సత్తుపల్లి రైల్వే లైన్ ను ఈనెల 12 న ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారని, అయితే ఈ రైల్వే లైన్ కోసం మొత్తం రూ. 927.94 కోట్లు వ్యయం కాగా, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి రూ. 618.55 కోట్ల ఖర్చును భరించిందని వినోద్ కుమార్ తెలిపారు.