
- తిరుగుబాటుకు కుట్ర పన్నిన కేసులో ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు
బ్రెసిలియ: 2022లో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నిన కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో(70)ను ఆ దేశ సుప్రీం కోర్టు దోషిగా తేల్చింది. అంతేగాక, ఆయనకు 27 ఏండ్ల మూడు నెలల జైలు శిక్షను కూడా ఖారారు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల బెంచ్ లో నలుగురు జడ్జీలు బోల్సోనారోను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించారు. జస్టిస్ కార్మెన్ లూసియా, జస్టిస్ క్రిస్టియానో జానిన్..గురువారం బోల్సోనారోను దోషిగా పేర్కొంటూ ఓటు వేయడంతో శిక్ష ఖరారైంది. అంతకుముందే జస్టిస్ అలెగ్జాండర్ డి మోరేస్, జస్టిస్ ఫ్లేవియో డీనో కూడా ఆయనను దోషిగా పేర్కొన్నారు. అయితే, బెంచ్ లోని జస్టిస్ లూయిజ్ మాత్రం బోల్సోనారోను నిర్దోషిగా ప్రకటించారు.
బోల్సోనారో 2019 నుంచి-2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2022 ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అధికారంలోకి వచ్చారు. అయితే, బోల్సోనారో ఓటమి తర్వాత కూడా అధికారంలో కొనసాగడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయనపై ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర, ప్రజాస్వామ్య పాలనను రద్దు చేసే ప్రయత్నం, క్రిమినల్ సంస్థలకు నాయకత్వం, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడం, వారసత్వ సంపదను ధ్వంసం చేయడం వంటి ఐదు కీలక కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర సంబంధించిన కేసులోనే బోల్సోనారోకు 27 ఏండ్ల మూడు నెలలు జైలు శిక్ష పడింది.
అదే ఐదు ఆరోపణలపై దోషిగా తేలితే మాత్రం ఆయన 40 ఏండ్లకు పైగా జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం బోల్సోనారో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ తీర్పుపై 11 మంది సభ్యులు గల పూర్తిస్థాయి సుప్రీం కోర్టు ధర్మాసనానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఆయనకు ఉంది. కాగా..ఈ తీర్పుపై ట్రంప్ స్పందించారు. బోల్సోనారో తనకు మంచి మిత్రుడని తెలిపారు. రాజకీయ కక్ష, ప్రతీకారంలో భాగంగానే ఈ తీర్పు వెలువడిందని అభిప్రాయపడ్డారు. "గతంలో నాకూ ఇలాగే జరిగింది. కానీ వారు సక్సెస్ కాలేకపోయారు" అని చెప్పారు. ఇప్పటికే బ్రెజిల్‌పై 50% టారిఫ్‌లు విధించిన ట్రంప్.. ఈ తీర్పు తర్వాత మరిన్ని టారిఫ్ లు విధిస్తామని పేర్కొన్నారు.