పెండింగ్ సీట్లపై బీఆర్ఎస్ కసరత్తు

పెండింగ్ సీట్లపై బీఆర్ఎస్  కసరత్తు
  • అందుబాటులో ఉండాలని  నర్సాపూర్ ​నేతలకు సమాచారం 
  • మల్కాజ్ గిరి అభ్యర్థి కోసం ఫ్లాష్ సర్వేలు 

హైదరాబాద్, వెలుగు: మల్కాజ్​గిరి అసెంబ్లీ స్థానంతో పాటు పెండింగ్​లో ఉన్న జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు బీఆర్ఎస్​ హైకమాండ్​కసరత్తు చేస్తోంది. జనగామ టికెట్​విషయంలో క్లారిటీ రావడంతో నర్సాపూర్​ సీటుపై దృష్టి సారించింది. రెండు రోజుల్లో ఎప్పుడైనా పిలుపు రావొచ్చని అందుబాటులో ఉండాలని నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మహిళా కమిషన్ ​చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి సహా స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చారు. సోమవారం వీరిద్దరితో మాట్లాడి టికెట్ ఎవరికి ఇస్తామనే దానిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అదేరోజు గోషామహల్​ నేతలను పిలిచి మాట్లాడనున్నారు. మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో మల్కాజ్ గిరి సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్ సర్వే రిపోర్టులు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఈ సీటు మర్రి రాజశేఖర్​రెడ్డికే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి వర్గీయులు ధీమాగా ఉన్నారు. ఈ సీటు దక్కించుకోవాలని ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్​ విజయశాంతిరెడ్డితో పాటు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి సీటుపై పెద్దగా పేచీ లేకపోవడంతో అక్కడ అభ్యర్థిని ప్రకటించనున్నారు. 

మల్కాజ్ గిరిలో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ 

మల్కాజ్ గిరి టికెట్ తనకు​ఇచ్చినా, తన కొడుకు రోహిత్​కు మెదక్ ​టికెట్​ఇవ్వలేదని ఆగ్రహించిన మైనంపల్లి హన్మంతరావు తాజాగా బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పడంతో అక్కడ ప్రత్యామ్నాయాలపై బీఆర్ఎస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు 21న మధ్యాహ్నం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు.. అదేరోజు ఉదయం తిరుమలలో మంత్రి హరీశ్​రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాతా ఆరోపణలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనంపల్లిని బుజ్జగించవచ్చనే కారణంతోనే చర్యలకు వెనుకాడినట్టు తెలుస్తోంది. కానీ రెండు సీట్లలో పోటీపై పట్టుదలతో ఉన్న మైనంపల్లి బీఆర్ఎస్​ను వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రత్యామ్నాయాలపై పార్టీ ఫోకస్​ చేసింది. ఎవరైతే గెలుస్తారనే దానిపై ఫ్లాష్​ సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే రిపోర్టులతో పాటు టికెట్ ​కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. మంగళ, బుధవారాల్లోనే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా కారణాలతో చేయలేకపోతే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగానైనా ఈ వారంలోనే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది.  

స్థానికులు, ఉద్యమకారులకే టికెటివ్వాలె 

మల్కాజ్ గిరికి చెందిన స్థానికులు, తెలంగాణ ఉద్యమకారులకే టికెట్​ఇవ్వాలని స్థానిక బీఆర్ఎస్​నాయకులు డిమాండ్ ​చేశారు. మైనంపల్లి పార్టీని వీడిన నేపథ్యంలో 2001 నుంచి బీఆర్ఎస్​లో పని చేస్తున్న నాయకులు శనివారం స్థానిక ఫంక్షన్ ​హాల్​లో సమావేశమయ్యారు. మాజీ కార్పొరేటర్లు బద్దం పరుశురాం రెడ్డి, జితేందర్​రెడ్డి, నాయకులు సిద్ది రాములు, వెంకన్న, ఖలీల్, రఘు యాదవ్, శేఖర్​గౌడ్​మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే టికెట్​రెండుసార్లు ఆల్వాల్ లీడర్లకే ఇచ్చారని, ఈసారి స్థానికులు, తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్​గా పని చేసిన వారికే ఇవ్వాలన్నారు. తమలో ఒకరికి టికెట్​ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. స్థానికేతరులకే టికెట్​ఇస్తున్నట్టుగా కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, ఇప్పుడు కూడా ఉద్యమకారులు, స్థానికులను విస్మరించడం తగదన్నారు.