యూనివర్సిటీల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సత్వర న్యాయం ఎప్పుడు?

యూనివర్సిటీల్లో అవుట్  సోర్సింగ్ సిబ్బందికి సత్వర న్యాయం ఎప్పుడు?

ఏ రాష్ట్రమైనా,  ఏ దేశమైనా  అభివృద్ధి చెందాలంటే,  అత్యున్నత  విలువలతో  కూడిన ప్రాంతంగా విలసిల్లాలంటే..  ఆ ప్రాంతంలోని  ఉన్నత విద్యకు  ప్రాధాన్యత  ఇవ్వాలి.  ఇది చారిత్రక సత్యం.   అయితే,  మన రాష్ట్రంలోని ఉన్నత విద్యను  పరిశీలించినట్లయితే  తెలంగాణ  రాష్ట్రం ఏర్పడినప్పటి  నుంచి ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.  కొత్త యూనివర్సిటీలు,  కొత్త కోర్సులు,  న్యాక్ ర్యాంకింగ్స్,  డిజిటలైజేషన్, పరిశోధనలపై దృష్టి.. ఇలా ప్రభుత్వాలు తరచూ ఉన్నత విద్య అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి.  ఆ మాటలు ఆచరణలో సాధ్యం కావడానికి  విద్యాభివృద్ధిలో నిత్యం వెనుక నుండి పనిచేస్తూ వ్యవస్థను నడిపించే  నాన్‌ టీచింగ్ సిబ్బంది పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యింది.

  ఏడేళ్లుగా  బోధనేతర ఉద్యోగుల స్థితిగతులు మారకపోవడం వలన తీవ్రమైన ఒత్తిడికి  గురవుతున్నారనేది  నగ్నసత్యం.  వీరి  సమస్యలు తీర్చరానివా?  ఉన్నత విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం అని చెప్పుకుంటున్న  ప్రభుత్వాలు వారి సమస్యలు పట్టించుకోకపోవడం దేనికి ప్రతీక?  ఆర్థికంగా కుంగిపోయి, ఉద్యోగ భద్రత  లేక మానసికంగా కుంగిపోయిన బోధనేతర  సిబ్బంది ద్వారా  నాణ్యమైన పనితీరు ఆశించడం  సాధ్యమేనా? 


ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్రంలో  మొత్తం 18 యూనివర్సిటీల్లో..  ఉస్మానియా  యూనివర్సిటీ,  కాకతీయ  యూనివర్సిటీ,  అంబేద్కర్,  శాతవాహన,  మహాత్మాగాంధీ యూనివర్సిటీ,  పాలమూరు,  తెలుగు యూనివర్సిటీ,  చాకలి ఐలమ్మ మహిళా  యూనివర్సిటీ,  ఆచార్య  ఎన్.జి. రంగా యూనివర్సిటీ,  కాళోజీ  అగ్రికల్చరల్ యూనివర్సిటీ  మొదలగువాటిల్లో సుమారు  6 వేల మంది పై చిలుకు బోధనేతర సిబ్బంది నాన్‌టీచింగ్(అవుట్‌సోర్సింగ్) ఉద్యోగులు పనిచేస్తున్నారు.  వీరిలో చాలామంది  కాంట్రాక్ట్‌,  ఔట్‌సోర్సింగ్‌,  డైలీ వేజ్ విధానంలో  పనిచేస్తున్నారు.  

యూనివర్సిటీ  పరిపాలన,  పరీక్షల  నిర్వహణ,  విద్యార్థుల  సర్టిఫికెట్లు,  లైబ్రరీలు,  ల్యాబ్‌లు,  అకౌంట్స్‌, అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  విభాగాలన్నింటినీ  నడిపిస్తున్నవారు వీరే.  అయినాసరే  వీరి జీవన భద్రతపై  ప్రభుత్వానికి ఎందుకు శ్రద్ధ లేదు అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.  గత  ఏడు సంవత్సరాలుగా వీరి వేతనాల్లో ఎలాంటి గణనీయమైన సవరణ లేదు.  చాలాచోట్ల సకాలంలో జీతాలు కూడా అందడం లేదు.  ఒకవైపు ధరలు పెరుగుతుంటే,  మరోవైపు  స్థిర ఆదాయం లేక కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వహించాలి అన్నది అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, అనిశ్చితి పెరుగుతోంది.  ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా చూడాలా? లేక ప్రభుత్వ వైఫల్యంగా భావించాలా? బోధనేతర సిబ్బంది పడుతున్న ఇబ్బందిలో ప్రభుత్వ పాత్ర లేదనుకోవాలా? 

పరిపాలనా వ్యవస్థ బలంగా ఉండాలి

యూనివర్సిటీల్లో  రెగ్యులర్  ఉద్యోగులతో  సమానంగా పని చేస్తున్నా, వారికి లభించే ప్రయోజనాలు మాత్రం నాన్‌టీచింగ్  సిబ్బందికి  దక్కడం లేదు.  ‘సమాన పనికి  సమాన వేతనం’ అన్న సూత్రం వీరి విషయంలో ఎందుకు అమలుకావడం లేదు?  రాష్ట్ర ప్రభుత్వం  కార్మిక సంక్షేమం  గురించి  మాట్లాడుతున్నప్పుడు,  ఈ  ఉద్యోగులు కార్మికులే కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది.   ప్రభుత్వం తరచూ విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచాలంటూ  ప్రకటనలు చేస్తోంది.  న్యాక్ ర్యాంకులు మెరుగుపడాలంటే  అకడమిక్ స్టాఫ్‌తో పాటు పరిపాలనా వ్యవస్థ కూడా బలంగా ఉండాలి.  కానీ ఆ వ్యవస్థను  నడిపించే  సిబ్బందే  అసంతృప్తితో ఉంటే  నాణ్యత ఎలా పెరుగుతుంది?  ఉద్యోగ భద్రత లేని సిబ్బందితో  సమర్థవంతమైన పరిపాలన సాధ్యమా?  ఉన్నత విద్యారంగంలో  విప్లవాత్మక  మార్పులు  తెస్తున్నామని  చెప్పుకునే  గొప్పలు  ఎండమావులుకాక ఏమవుతాయి?

పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమా?

నాన్‌ టీచింగ్ సిబ్బంది డిమాండ్లు కొత్తవేమీ కాదు.  రెగ్యులరైజేషన్‌,  వేతన సవరణ,  సామాజిక భద్రత,  ప్రమోషన్లు వంటి అంశాలు ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లోనే  ఉన్నాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో   తెలంగాణ బిడ్డలకు అన్యాయం  జరిగింది అనుకున్నా?   తెలంగాణ  స్వరాష్ట్రం  సాధించుకున్నాక  కూడా  అదే అన్యాయం  కొనసాగితే,  రాష్ట్రం సాధించుకున్న  ప్రయోజనం  ఏమిటో ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి.  ప్రభుత్వం మారినా,  హామీలు ఇచ్చినా ఫైళ్లు కదలడం లేదు.  ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? లేక ఉద్దేశపూర్వకంగా సమస్యను పక్కన పెట్టడమేనా?  రాష్ట్రం వచ్చి  కేసీఆర్  పరిపాలనలో  కొన్నేండ్లు..,   ప్రస్తుత  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో మరి కొన్నేండ్లు ఆగుతూ సాగుతూ.. వేచి చూస్తూ.. సమస్యలు పరిష్కారంకాక  అర్థాకలితో  బతుకు నావ  సాగించాలా? 
 

ప్రభుత్వం మేల్కొవాలి

యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా, తాత్కాలిక విధానాలపైనే ఆధారపడటం దీర్ఘకాలంలో వ్యవస్థను బలహీనపరుస్తుంది.  యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉన్నప్పుడు, ఇప్పటికే  పనిచేస్తున్నవారికి భద్రత  ఇవ్వకపోవడం  
ఎంతవరకు సమంజసం?  ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం కాదా?  బుద్ధిజీవులే ఆలోచించాలి.  నిజానికి,  నాన్‌టీచింగ్  సిబ్బంది  సమస్యను  పరిష్కరించడం ద్వారా  ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇవ్వవచ్చు.  ఉన్నత  విద్యా  వ్యవస్థలో ప్రతి ఉద్యోగి 
విలువైనవాడేనని, పరిపాలనకు కూడా సమాన గౌరవం ఉందని చెప్పే అవకాశం ఇది.  కానీ ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు.   

ఇప్పటికైనా  ప్రభుత్వం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.  యూనివర్సిటీల్లో  పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బందికి న్యాయం చేయకుండా ఉన్నత విద్య అభివృద్ధి గురించి మాట్లాడటం నిష్ప్రయోజనం.  కేవలం మాటలకే పరిమితం కాకుండా, వాస్తవిక పరిస్థితులు  అర్థం చేసుకుని  ప్రభుత్వం,  బోధనేతర  సిబ్బంది పడుతున్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి.  ప్రజా ప్రభుత్వం అనే మాట కేవలం ప్రకటనలతో పరిమితం కాకుండా  కాంగ్రెస్  ప్రభుత్వం  రాష్ట్రంలో  వివిధ యూనివర్సిటీలలో ఉన్న అన్ని రకాల  బోధనేతర సిబ్బందికి  అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా నిలబడాలి.   అవుట్ సోర్సింగ్​ బోధనేతర సిబ్బందికి సత్వరమే న్యాయం చేయాలి.   

- డి.సంధ్య, 
శాతవాహన యూనివర్సిటీ

NOTE : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.