
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో దేవి ప్రసాద్, పల్లె రవికుమార్, బాలరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగి పోయిన అంశాన్ని రాజకీయం చేస్తూ విష ప్రచారానికి దిగి కేసీఆర్, హరీశ్ రావు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ను నిలువరించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారని వివరించారు. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. సీబీఐ, ఈడీలపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎలా ఆదేశించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.