
- రాష్ట్ర సర్కార్‌కు ఫారెస్ట్ ఆఫీసర్ల డిమాండ్
- అన్ని సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియల్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఆయుధాలు లేకుండా అడవుల్లో పనిచేసే పరిస్థితులు లేవని ఫారెస్ట్ ఆఫీసర్లు అన్నారు. తమకు గన్స్ ఇప్పించాలని, ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించాలని ఉన్నతాధికారులను కోరారు. పోలీస్ స్టేషన్ల మాదిరిగానే ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం అటవీ శాఖలోని అన్ని స్థాయిల ఆఫీసర్ల సంఘాలతో పీసీసీఎఫ్ డోబ్రియల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో జరిగిన ఈ భేటీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తెలంగాణ చాప్టర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రేంజర్ శ్రీనివాసరావు హత్య విషయంలో డోబ్రియల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ స్టేషన్లు పెట్టి, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖల నుంచి ఫారెస్ట్ సిబ్బందికి సహకారం ఉండటం లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. మూడు శాఖల సమన్వయం ఉంటేనే అటవీ భూముల హద్దులు గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గుత్తి కోయలు పోడు సాగుదారుల కిందకు రారని, వారిని పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి, అడవి నుంచి బయటకు తీసుకురావాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఫీల్డ్ లెవల్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఆఫీసర్లకు హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలిపి, ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎంసీ పర్గెయిన్, పీసీసీఎఫ్(విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన పీసీసీఎఫ్ డోబ్రియల్...
ఎఫ్ఆర్‌వో శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డిని పీసీసీఎఫ్ డోబ్రియల్ గురువారం కలిశారు. శ్రీనివాస్ రావు హత్య, ఇతర పరిణామాలపై డీజీపీతో చర్చించారు. గ్రౌండ్ లెవల్‌లో పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బందికి పోలీస్ శాఖ సహకరించాలని ఆయన కోరారు. సున్నిత ప్రాంతాల్లో ఎక్కువ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.