యూఎస్‌‌ ఓపెన్‌‌లో అల్కరాజ్‌‌ బోణీ.. అలవోకగా విజయం సాధించిన స్పెయిన్‌‌ యువ సంచలనం

యూఎస్‌‌ ఓపెన్‌‌లో అల్కరాజ్‌‌ బోణీ.. అలవోకగా విజయం సాధించిన స్పెయిన్‌‌ యువ సంచలనం
  • రుడ్‌‌, డ్రాపెర్‌‌, రునె, తియాఫో ముందంజ
  • కీస్‌‌, వీనస్‌‌, క్విటోవాకు చుక్కెదురు

న్యూయార్క్‌‌: నున్నగా గుండు చేయించుకుని కొత్త లుక్‌‌ (బజ్‌‌ కట్‌‌)తో బరిలోకి దిగిన స్పెయిన్‌‌ స్టార్‌‌ ప్లేయర్‌‌ కార్లోస్‌‌ అల్కరాజ్‌‌.. యూఎస్‌‌ ఓపెన్‌‌లో బోణీ చేశాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో రెండోసీడ్‌‌ అల్కరాజ్‌‌ 6–4, 7–5, 6–4తో రిలీ ఒపెల్కా (అమెరికా)పై నెగ్గాడు. ఫలితంగా గ్రాండ్‌‌ స్లామ్‌‌ టోర్నీలో తన తొలి రౌండ్‌‌ విజయాల రికార్డును 19–0కు పెంచుకున్నాడు. రెండు గంటలా 5 నిమిషాల మ్యాచ్‌‌లో అల్కరాజ్‌‌ తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో అలరించాడు. ఒపెల్కా బిగ్‌‌ సర్వీస్‌‌లను అలవోకగా ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌‌ మొత్తంలో 6 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌, 17 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేయగా, 58 ఫస్ట్‌‌ సర్వ్‌‌ పాయింట్లలో 50 గెలిచాడు. ఎదుర్కొన్న మూడు బ్రేక్‌‌ పాయింట్లను కాపాడుకున్నాడు.

 ఒపెల్కా సర్వ్‌‌ పాయింట్లను మూడుసార్లు బ్రేక్‌‌ చేశాడు. 14 ఏస్‌‌లు కొట్టిన ఒపెల్కా 9 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేశాడు. 32 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌తో మూల్యం చెల్లించుకున్నాడు. టోర్నీలో ఆడటానికి ముందు అల్కరాజ్‌‌.. గోల్ఫ్‌‌ స్టార్‌‌ రోరీ మెక్‌‌ల్రాయ్‌‌ను కలిశాడు. ఈ సందర్భంగా రోరీ తన చేతిని అల్కరాజ్‌‌ తలపై రుద్దాడు. ఆ టైమ్‌‌లో విపరీతంగా జుట్టుతో ఉన్నాడు. కానీ తొలి రౌండ్‌‌ మ్యాచ్‌‌లో క్లీన్‌‌ షేవ్‌‌తో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌‌ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొత్త హెయిర్‌‌ కట్‌‌ను ఇష్టపడుతున్నారా? అని కోర్టులోని ప్రేక్షకులను అడిగాడు. వాళ్లు ఒక్కసారి సౌండ్‌‌ చేస్తూ ఓకే చెప్పారు. 

ఇతర మ్యాచ్‌‌ల్లో జాక్‌‌ డ్రాపర్‌‌ (బ్రిటన్‌‌) 6–4, 7–5, 6–7 (7/9), 6–2తో ఫెడిరికో అగస్టిన్‌‌ గోమెజ్‌‌ (అర్జెంటీనా)పై, కాస్పర్‌‌ రుడ్‌‌ (నార్వే) 6–1, 6–2, 7–6 (7/5)తో సెబాస్టియన్‌‌ ఆఫ్నెర్‌‌ (ఆస్ట్రియా)పై, హోల్గర్‌‌ రునె (డెన్మార్క్‌‌) 6–3, 7–6 (7/4), 7–6 (7/2)తో బొటిక్‌‌ వాన్‌‌ డి జెండ్‌‌స్కప్‌‌ (నెదర్లాండ్స్‌‌)పై, ఫ్రాన్సిస్‌‌ తియాఫో (అమెరికా) 6–3, 7–6 (8/6), 6–3తో యెషిహిటో నిషియోక (జపాన్‌‌)పై, కామెరూన్‌‌ నోరి (బ్రిటన్‌‌) 7–5, 6–4తో కోర్డా (అమెరికా)పై, కచెనోవ్‌‌ (రష్యా) 6–7 (5/7), 6–3, 7–5, 6–1తో నిశేష్‌‌ బసవారెడ్డి (అమెరికా)పై, రబ్లెవ్‌‌ (రష్యా) 6–4, 6–4, 6–4తో డినో ప్రిజ్మిక్‌‌ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి అడుగుపెట్టారు. 

కీస్‌‌కు రెనాటా చెక్‌‌..

ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ చాంపియన్‌‌ మాడిసన్‌‌ కీస్‌‌కు తొలి రౌండ్‌‌లోనే చుక్కెదురైంది. అన్‌‌సీడెడ్‌‌ రెనాటా జరాజువ (మెక్సికో) 6–7 (10/12), 7–6 (7/3), 7–5తో కీస్‌‌పై సంచలన విజయం సాధించింది. 3 గంటలా 10 నిమిషాల మ్యాచ్‌‌లో కీస్‌‌ 89 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌, 14 డబుల్‌‌ ఫాల్ట్స్‌‌తో తడబడింది. 12 బ్రేక్‌‌ పాయింట్లలో ఐదింటిని మాత్రమే కాపాడుకుంది. ఒక్క ఏస్‌‌ కూడా కొట్టని రెనాటా ఐదు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసింది. 6 బ్రేక్‌‌ పాయింట్లను కాపాడుకుంది. 34 అన్‌‌ ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేసింది. వీనస్‌‌ విలియమ్స్‌‌ 3–6, 6–2, 1–6తో కరోలినా ముచోవా (చెక్‌‌) చేతిలో కంగుతిన్నది. 

ఇతర మ్యాచ్‌‌ల్లో క్రేజికోవా (చెక్‌‌) 6–3, 6–2తో మొబోకో (కెనడా)పై, ఆండ్రీవా (రష్యా) 6–0, 6–1తో పార్క్స్‌‌ (అమెరికా)పై, డియానె ప్యారీ (ఫ్రాన్స్‌‌) 6–1, 6–0తో పెట్రా క్విటోవా (చెక్‌‌)పై, అనా బోండర్‌‌ (హంగేరి) 6–2, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్‌‌)పై, రిబకినా (కజకిస్తాన్‌‌) 6–3, 6–0తో పరెజా (అమెరికా)పై, కసాట్కినా (ఆస్ట్రేలియా) 7–5, 6–1తో గాబ్రియోలా రుస్‌‌ (రొమేనియా)పై, ఎలైస్‌‌ మార్టినెజ్‌‌ (బెల్జియం) 6–1, 6–0తో అలైసా అహ్న్‌‌ (అమెరికా)పై గెలిచి ముందంజ వేశారు.