హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇంటిని అమ్మి.. తిరిగి అక్రమంగా కబ్జా

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇంటిని అమ్మి.. తిరిగి అక్రమంగా కబ్జా
  • ఎన్నారై మహిళపై కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: తన ఇంటిని అమ్మిన ఎన్నారై మహిళ.. తిరిగి అదే ఇంటిని తన తల్లిపై గిఫ్ట్ డిడ్ చేసి అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా కొనుగోలు దారులపై దాడికి పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం..  సునీల్ కుమార్ ఆహుజా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో ఉన్న 764 చదరపు అడుగుల్లో ఉన్న ఎన్నారై శ్రీదేవి ఇంటిని 2009 సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి, అప్పటినుంచి అందులోనే నివసిస్తున్నారు. 

గత ఒకటిన్నర సంవత్సరాలుగా సునీల్ అహుజా కుటుంబం కొన్ని కారణాల వల్ల ఆ ఇంటి నుంచి బంజారా హిల్స్ లోని హుడా కాంప్లెక్స్ లో నివసిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఎన్నారై శ్రీదేవి తిరిగి ఆ ఇంటిని తన తల్లి అయిన పోలవరపు వరలక్ష్మికి గిఫ్ట్ డిడ్​గా సెకండ్ రిజిస్ట్రేషన్ చేసింది. తిరిగి ఆ ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకుంది. ఇల్లు కబ్జాకు గురైనట్లు గుర్తించిన సునీల్ కుమార్ ఆహుజా కొడుకు  ఆశిష్ కుమార్ ఆహుజా ఆదివారం తన మిత్రుడితో కలిసి వెళ్లాడు. అక్కడ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారు ఆశిష్ ఆకుమార్​ను బెదిరించి ఈ ప్రాపర్టీ తమదంటూ భయబ్రాంతులకు గురిచేశారు.

ఇద్దరని ఒక రూమ్ లో బంధించి ఇనుప రాడ్డుతో, కత్తితో దాడి చేశారు. అనంతరం గాయలతో బయటపడిన ఆశిష్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎన్నారై శ్రీదేవి, ఆమె తల్లి వరలక్ష్మి, సాగర్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.