
- ఈ అకడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించనున్న ఆఫీసర్లు
- పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆర్జీ 2 ఏరియా హైస్కూల్ ఎంపిక
- ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈలో బోధన
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లలో సీబీఎస్‌ఈ విధానం ఈ అకడమిక్ ఇయర్ నుంచి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పైలెట్ ప్రాజెక్ట్‌గా రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ 2 ఏరియాలో గల సింగరేణి హైస్కూల్‌ను ఎంపిక చేశారు. ఈ స్కూల్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఫస్ట్ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు సీబీఎస్‌ఈ విధానంలో విద్యా బోధన చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అనుమతులు రాగానే స్టూడెంట్ల నుంచి ఆప్షన్ తీసుకుని పాఠాలు చెప్పనున్నారు.
కార్మికులు, సంఘాల డిమాండ్ మేరకే...
సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న 40 వేల మంది కార్మికుల్లో 16 వేల మంది వరకు యువ కార్మికులు ఉన్నారు. వారిపిల్లలకు నాణ్యమైన విద్యా బోధన కావాలని కార్మిక సంఘాలతో పాటు కార్మికులు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సింగరేణి హైస్కూళ్లలో కూడా సెంట్రల్ సిలబస్‌తో విద్యాబోధన చేయాలని భావించిన సింగరేణి మేనేజ్‌మెంట్ ఇందుకోసం కేంద్రానికి లెటర్ రాసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ బోధన స్టార్ట్ చేసేందుకు సిద్ధం కాగా ఇందుకోసం సింగరేణిలోనే 100 శాతం ఉత్తీర్ణత సాధించిన గోదావరిఖని యైటింక్లయిన్ కాలనీలోని సెక్టార్ 3 హైస్కూల్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.
ఇందుకోసం స్థానికంగా స్కూల్ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్, ట్రాఫిక్, బిల్డింగ్ సేఫ్టీ, తహసీల్దార్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్లను తీసుకొని ఎంఈవో, డీఈవో, ఆర్‌జేడీ ద్వారా హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు లెటర్ పంపారు. వచ్చే ఏడాది నుంచి దశలవారీగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఎనిమిది హైస్కూళ్లలో కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సెంట్రల్‌తో పాటు స్టేట్ సిలబస్
సింగరేణి హైస్కూల్‌లో ప్రస్తుతం స్టేట్ సిలబస్ ద్వారా విద్యా బోధన సాగుతోంది. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నప్పటికీ ఇందులో చేరడానికి ఆసక్తి చూపని స్టూడెంట్లకు స్టేట్ సిలబస్‌లోనే విద్యా బోధన కొనసాగిస్తారు. అయితే పాత వారికి మాత్రమే స్టేట్ సిలబస్‌లో విద్యా బోధన కొనసాగిస్తూ, కొత్త వారికి మాత్రం ఆ సిలబస్ కోసం అడ్మిషన్ ఇవ్వరు. కేవలం సీబీఎస్‌ఈకి మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటారు.
ఇక సింగరేణి హైస్కూల్‌లో 34 రూమ్‌లు ఉండగా ఇందులో 20 రూమ్‌లను సీబీఎస్‌ఈ క్లాస్‌ల కోసం కేటాయిస్తున్నారు. ప్రాక్టికల్ విద్యా బోధనకు అవసరమైన ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా అనుభవం ఉన్న టీచర్లతో పాటు మెంటల్లీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్స్టూడెంట్ల కోసం ప్రత్యేక టీచర్లు, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్లను సైతం రిక్రూట్ చేయనున్నారు.
మెరుగైన విద్యనందించేందుకే...
కార్మిక సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్ల పిల్లలకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయాలని కార్మిక సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటి సారిగా ఆర్జీ 2 ఏరియాలోని సింగరేణి హైస్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నాం. మెరుగైన విద్యను అందించడం ద్వారా అంతే స్థాయిలో ఫలితాలను కూడా ఆశించడానికి అవకాశం కలుగుతుంది.
- బలరాంనాయక్, సింగరేణి సీఎండీ