- ‘ఓట్ బచావో..దేశ్ బచావో’ నినాదంతో ఢిల్లీ దద్దరిల్లాలి
- తెలంగాణలోనే 73 లక్షల ఓట్లను తొలగించారు: సచిన్ సావంత్
హైదరాబాద్/మేడిపల్లి, వెలుగు: దేశంలోనే అతిపెద్ద నేరస్థుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే ఆరోపించారు. అతన్ని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి పౌరునికి జ్ఞానేశ్ దొంగతనం గురించి తెలిసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
నవంబర్ 1న ఢిల్లీలో “ఓట్ బచావో..దేశ్ బచావో” నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. దీనికి తెలంగాణ నుంచి భారీ జన సమీకరణ చేయడం కోసం పార్టీ హైకమాండ్ అవినాశ్ పాండేను రాష్ట్రానికి అబ్జర్వర్ గా నియమించింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్ లు ఉండగా, ఒక్క జ్ఞానేశ్ కుమార్ మాత్రమే భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఓటు విషయంలో ఫామ్..7 పై మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా, ఈయన దీన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
సర్ పేరుతో ఓట్ల తొలగింపు అనేది దేశంలోని లౌకికవాదంపై జరుగుతున్న దాడి అని, ఇక్కడ లౌకికవాదం హత్యకు గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్ పై కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీల మైదానంలో జరగనున్న భారీ సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని, ‘‘ఓట్ బచావో...దేశ్ బచావో’’ నినాదంతో దద్దరిల్లాలని కోరారు.
కాంగ్రెస్ నిరసనలో లద్దాఖ్ నుంచి అండమాన్ వరకు అన్ని ప్రాంతాల నేతలు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ..సర్ పేరుతో ఒక్క తెలంగాణలోనే 73 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు.
సర్ కు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అందుకే ఢిల్లీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వచ్చిన అవినాశ్ పాండే ను గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శాలువాతో సత్కరించారు.
కేంద్రం చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారింది: కుమార మంగళం
అర్హులైన పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఏఐసీసీ పరిశీలకులు మోహన్ కుమార మంగళం ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతను కోల్పోయిందని.. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు.
సోమవారం మేడ్చల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోహన్, పీసీసీ ఉపాధ్యక్షులు యూసఫ్, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడారు. సర్ ప్రక్రియ పేరుతో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా ఓటర్లను తొలగించారని.. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆరోపించారు.
