ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

హైవే పనులను వెంటనే చేపట్టాలి
మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట, వెలుగు : సిద్దిపేటలో జరుగుతున్న రెండు జాతీయ రహదారుల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. శనివారం క్యాంప్​ఆఫీస్ లో ఎల్కతుర్తి– మెదక్,  జనగామ -– సిరిసిల్ల రహదారుల నిర్మాణ పనులపై మంత్రి హైవే అథారిటీ అధికారులతో రివ్యూ నిర్వహించారు.  హన్మకొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదుగా వెళ్లే  137.6 కిలో మీటర్లు ఎల్కతుర్తి మెదక్  హైవే నిర్మాణాన్ని2 ప్యాకేజీలుగా విభజించినట్లు తెలిపారు.  మెదక్ నుంచి సిద్దిపేట వరకు  69 కిలో మీటర్లు   మొదటి ప్యాకేజీ  ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు 64 కిలో మీటర్లు  రెండవ ప్యాకేజీగా  పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. రెండవ రహదారి నిర్మాణ పనులను అక్టోబర్  మొదటి వారంలో  ప్రారంభించి యేడాదిన్నరలోగా పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. ఈ రివ్యూలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ మోహన్, ఆర్డీవో అనంతరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేటలో వర్కింగ్ ఉమెన్స్ భవన్, వృద్దాశ్రమం  నిర్మిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం సిద్దిపేట క్యాంపు ఆఫీస్​లో కలెక్టర్, సీపీ, ఆర్డీవో, తహసీల్దార్​డీఎంహెచ్​వో, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అంశాలపై సమీక్షించి మాట్లాడారు.  

కొత్త మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

చేర్యాల, వెలుగు: కొత్త మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చైర్ పర్సన్​ ఎ. స్వరూపరాణి అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని 2వ వార్డులోని ఎస్సీ కాలనీలో కౌన్సిలర్​చెవిటి లింగంతో కలిసి  సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీకి రూ. 1 కోటి ఫండ్​రావడంతో  అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పక్కాగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైస్​ చైర్మన్​ నిమ్మ రాజీవ్​రెడ్డి, కౌన్సిలర్లు జుబేదా ఎక్బాల్, నరేందర్, సతీశ్​గౌడ్​, యం. తారా తదితరులు పాల్గొన్నారు. 

వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాలి

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేశ్​షెట్కార్ డిమాండ్ చేశారు. శనివారం పెద్దశంకరంపేటలో వీఆర్ఏల దీక్షా శిబిరానికి వచ్చి  ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు.  వీఆర్ఏలకు  అసెంబ్లీ సాక్షిగా  సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.  రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేశ్​, పెద్దశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్, నాయకులు జనార్దన్,  గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశ్వకర్మల అభివృద్ధికి పాటుపడాలి

మెదక్​ (నర్సాపూర్​), వెలుగు: విశ్వకర్మల అభివృద్ధికి ప్రతి  ఒక్కరూ పాటుపడాలని  రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ జిల్లా నాయకుడు వాల్దాస్ మల్లేశ్​ గౌడ్ పిలుపునిచ్చారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా శనివారం విశ్వ బ్రాహ్మణులు నర్సాపూర్​ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయానికి ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న మల్లేశ్​ గౌడ్ ను​  విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కృపాచార్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్,  బ్రహ్మం, సుధాకర్ చారి, ప్రభాకర్ చారి, సత్యనారాయణ  పాల్గొన్నారు.

తెలంగాణను విలీనం చేసిన ఘనత కాంగ్రెస్​దే 

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: దేశంలో తెలంగాణను విలీనం చేసిన ఘనత కాంగ్రెస్​ పార్టీ దేనని హుస్నాబాద్​ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​ అన్నారు. శనివారం హుస్నాబాద్​లో విలీన దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​రెడ్డి మాట్లాడుతూ నాటి కాంగ్రెస్​ప్రభుత్వం హైదరాబాద్​సంస్థానంలో జరుగుతున్న అరాచకాలు తెలుసుకుని హైదరాబాద్​ను విలీనం చేసిందన్నారు. వల్లబాయ్ ​పటేల్​ కాంగ్రెస్​ లీడర్​అని, ఆయనను అడ్డంపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.  

కాంగ్రెస్​లో చేరికలు.. 

హుస్నాబాద్ కు చెందిన సందేవేన సతీశ్​, మహమ్మదాపూర్ కు చెందిన  బద్దిపడగ ఇంద్రారెడ్డి, పొన్నాల సంపత్ రెడ్డి, కత్తెర కనకయ్య, రావుల నారాయణ, కత్తెర రాజు లు ప్రవీణ్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

బీజేపీ ఆధ్వర్యంలో విమోచన ఉత్సవాలు

నెట్​వర్క్​, వెలుగు: తెలంగాణ విమోచన ఉత్సవాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పార్టీ ఆఫీసుల వద్ద జాతీయ జెండాలను ఎగరవేశారు.  కందిలోని సర్ధార్​వల్లబాయ్​పటేల్​విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా  బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి విమోచన దినోత్సవం రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించడం అమరవీరులను అవమానించినట్లేనని అన్నారు. సంగారెడ్డి, మెదక్​ జిల్లాల అధ్యక్షులు నరేందర్​రెడ్డి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. 

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో..

దూల్మిట్ట మండలంలోని బైరాన్​పల్లి బురుజు వద్ద కాంగ్రెస్​ నేత, మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్​రెడ్డి విలీన దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా  అమరవీరులకు నివాళి అర్పించారు. మెదక్​లో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు.


వాలీబాల్ అకాడమీలో అడ్మిషన్లు

మెదక్​ టౌన్​, వెలుగు : రాజన్న - సిరిసిల్ల జిల్లాలోని వాలీబాల్ అకాడమీలో అడ్మిషన్లకు ఈ నెల 19,  20 తేదీలలో సిరిసిల్ల మినీ స్టేడియంలో  క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు  మెదక్​ జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 14 –16 ఏండ్ల లోపు బాలురు ఈ ఎంపికలలో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు.  ఎత్తు 182 సెంటీమీటర్లు ఉండాలన్నారు.  ఆసక్తి గల వారు బర్త్​, ఆధార్​, ఎడ్యుకేషన్​ సర్టిఫికెట్లతో ఈ నెల 19న  సిరిసిల్ల మినీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని చెప్పారు.

కేసులలో రాజీయే రాజమార్గం
మెదక్ జిల్లా చీఫ్​ జస్టిస్​ లక్ష్మీశారద

మెదక్​ టౌన్/కంది, వెలుగు : కోర్టు కేసుల్లో రాజీయే రాజమార్గమని మెదక్​ జిల్లా చీఫ్​జస్టిస్​లక్ష్మీశారద అన్నారు. శనివారం మెదక్​లోని జిల్లా కోర్టుల బిల్డింగ్​లో లోక్​అదాలత్​ను నిర్వహించారు.  ఆయా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను కట్టంచారు. లోక్​అదాలత్​ మెంబర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. 

26  కేసులు పరిష్కారం

కంది, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన బ్యాంక్​ లోక్ ​అదాలత్​లో సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్​, నారాయణఖేడ్​ పరిధిలో 26 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ హన్మంత్​ రావు తెలిపారు. జిల్లాలోని వివిధ బ్యాంకులలో నెలకొన్న  కేసులను పరిష్కరించే విధంగా బ్యాంక్​ లోక్​ అదాలత్​ను నిర్వహించామని చెప్పారు. ఈ మేరకు  రూ.39,72,700  రికవరీ చేశామని తెలిపారు.  

రూల్స్​ పాటించని  హాస్పిటల్​ సీజ్​

దుబ్బాక, వెలుగు: ​ అర్హులైన  డాక్టర్లు  లేకుండానే ఆపరేషన్లు ఐపీ, ఓపీ ట్రీట్​మెంట్​చేస్తున్న రత్నాకర్ ఆస్పత్రిని శనివారం డిఫ్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాస్​ సీజ్​ చేశారు. శనివారం దుబ్బాకలో పర్యటించిన జిల్లా వైద్యశాఖ అధికారుల బృందం.. పట్టణంలో ఇటీవల ఇంటర్​ అమ్మాయి మృతికి కారణమైన పీఎంపీ డాక్టర్​ దామోదర్​రెడ్డికి షోకాజ్​ నోటీస్​ ఇచ్చారు. ​పీఎంపీ లు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని, ఆపరేషన్లు చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని డిఫ్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాస్​హెచ్చరించారు.  పీవోఎన్​హెచ్​ఎన్​ డాక్టర్​ రజనీ, డీఐవో విజయరాణి, హెచ్​ఈవో దయాకర్  పాల్గొన్నారు.

రాజకీయ లబ్ధికోసమే బీజేపీ విమోచనం : చాడ వెంకటరెడ్డి

కోహెడ(హుస్నాబాద్​)వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు ముందుండి నడిపించారని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఏ సంబంధం లేని బీజేపీ రాజకీయ లబ్ధి కోసం విమోచన దినోత్సవం నిర్వహిస్తుందని మండిపడ్డారు. శనివారం అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో అమర వీరుల స్తూపాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చాడ  మాట్లాడుతూ అధికార దాహంతో రాష్ట్రంలో విష రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ తో జాగ్రత్తగా ఉండాలన్నారు.   అలాగే హుస్నాబాద్​ మండలం మహ్మదాపూర్​లో అమరవీరుల స్తూపాలను ఏ సంబంధం లేని బీజేపీ నాయకులు సందర్శించి అపవిత్రం చేశారని  సీపీఐ లీడర్లు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కార్యదర్శి మంద పవన్, మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, గడిపే మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.