వివేక్ వెంకటస్వామి దళితులకు ఆదర్శం

వివేక్ వెంకటస్వామి దళితులకు ఆదర్శం
  •     దళితులకు రాజ్యాధికారం కోసం కలిసి రా
  •     వివేక్ వెంకటస్వామి దళితులకు ఆదర్శం
  •     మందకృష్ణ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి
  •     మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య


ఖైరతాబాద్, వెలుగు:ఎస్సీ వర్గీకరణ అనేది కాలం చెల్లిన అంశం అని, మందకృష్ణకు దళితుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజ్యాధికార సాధన కోసం కలిసి రావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఒకవైపు దళితుల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి అగ్రవర్ణ పార్టీలు, కులాలు అధికారాన్ని పంచుకుంటున్నాయని, ఇంకా ఎంతకాలం ఇలా కొట్లాడుకుందామని ఆవేదన వ్యక్తం చేశారు. మాల మాదిగ ఉపకులాలు అన్నీ కలిసి అధికారం కోసం కొట్లాడితే రాష్ట్రంలో దళితుల పరిస్థితి మరోలా ఉంటుందని, ఆ దిశగా మందకృష్ణ తన బుద్ధిని, ఆలోచనల్ని  మార్చుకోవాలని సూచించారు.  శనివారం హైదరాబాద్​లోని సెంట్రల్​ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలం చెల్లిన వర్గీకరణ అంశాన్ని పట్టుకుని ఎస్సీల వర్గీకరణకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, ప్రధానమంత్రి అపాయింట్​మెంట్ ఇప్పించాలని ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు. దళితులను విడదీసే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది అంబేద్కర్ ఆశయాలకు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశం చర్చించవద్దని డిమాండ్ చేశారు  ఆదివారం ట్యాంక్​బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాపార్క్​ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వివాదరహితుడని, అవసరంలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిత్వం ఆయనదని పేర్కొన్నారు. ఆయన కాకా ఫౌండేషన్ ద్వారా కులాలకు అతీతంగా అనేకమందికి సాయం చేశారని తెలిపారు. వివేక్ వెంకటస్వామి తండ్రి కాకా కూడా చాలామంది బడుగు బలహీన వర్గాలవారికి బాసటగా గూడు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. శుక్రవారం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ వివేక్​ వెంకటస్వామిని బీజేపీ నుంచి తొలగించాలని వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. దళితులంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయడంతో కడుపులు నిండవని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్​ వెంకటస్వామి దళితులందరికీ ఆదర్శం అన్నారు. పార్టీ ఏదైనా దళితులు ఎదిగితే మంచిదేనని, వివేక్ వెంకటస్వామి ఎంతోమంది దళిత లీడర్లకు ఆదర్శమన్నారు. మందకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

దళిత వ్యతిరేకి మందకృష్ణ: పసుల రామ్మూర్తి

జగిత్యాల: దేశంలో దళితులంతా రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే మందకృష్ణ మాదిగ అగ్రవర్ణాల పక్షాన ఉండి దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి అన్నారు. మందకృష్ణకు తగిన గుణపాఠం చెప్పాలని దళిత సోదరులకు పిలుపునిచ్చారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు చిత్తార ప్రభాకర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పసుల రామ్మూర్తి మాట్లాడుతూ..  రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న గడ్డం వివేక్​ను బీజేపీ నుంచి తొలగించాని మందకృష్ణ అనడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల నారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసం రాణి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నర్ర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.