
- ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని అధిష్టానానికి వివరించి ఒప్పించినం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఉద్యమం లేదని.. రాష్ట్రం ఇచ్చేదిలేదని కొందరు అడ్డుకున్నరు
- ప్రజలు నష్టపోతరని ఢిల్లీలో ప్రచారం చేశారు
- అయినా అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చిందని వెల్లడి
- మందమర్రిలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్, వెలుగు: నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని అప్పటి కాంగ్రెస్‌హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి, ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్గ్రౌండ్లో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. కొందరు ఈ ప్రాంతంలో ఎలాంటి ఉద్యమం లేదని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వొద్దని వాదించారని.. రాష్ట్రం ఇస్తే ప్రజలు నష్టపోతారని ఢిల్లీలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించారన్నారు. దీంతో తెలంగాణ ఎంపీలందరం కలిసి కాంగ్రెస్ హైకమాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్చేశామన్నారు. ఇక్కడి వనరులు, ఉపాధి అవకాశాలు, ఇరిగేషన్, ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా అధిష్టానానికి వివరించామన్నారు. తమ వినతులు, పోరాటాలతో పాటు సబ్బండవర్గాల ఉద్యమాలు, విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాలతో కాంగ్రెస్ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని వివేక్ తెలిపారు.
టెండర్లలో పాల్గొని కొత్త బొగ్గు గనులు దక్కించుకోవాలి
కొత్త గనులు రాకపోతే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఎమ్మెల్యే వివేక్అన్నారు. నేరుగా బొగ్గు గనులు అలాట్మెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని, టెండరు ప్రక్రియలో పాల్గొని గనులను దక్కించుకుంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. సింగరేణి కొత్త గనులను దక్కించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. త్వరలో ఆ మీటింగ్ఉంటుందన్నారు. సింగరేణి సంస్థ 1995 లో బీఎఫ్ఐఆర్లోకి వెళ్లినప్పుడు.. కేంద్ర మంత్రిగా ఉన్న కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని పీవీ
నరసింహారావుతో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల రుణం ఇప్పించి సంస్థను కాపాడారన్నారు.
పేద, బడుగు బలహీన వర్గాలు, కార్మికుల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి అహర్నిశలు కృషి చేసేవారని చెప్పారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సింగరేణి ప్రగతి స్టాల్స్‌ను ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించి పరిశీలించారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్-స్వరూపరాణి దంపతులు, ఏస్వోటు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, సింగరేణి ఆఫీసర్స్ సంఘం ప్రెసిడెంట్ రమేశ్
తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు మునీర్ కుటుంబానికి పరామర్శ
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమీనగర్‌లో నిర్వహించిన మునీర్ దశ దినకర్మకు ఎమ్మెల్యే హాజరయ్యారు. వృత్తి పట్ల నిబద్ధత, సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావం కలిగిన మునీర్ మృతి.. పాత్రికేయలోకానికి, సింగరేణి ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.