
- బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి టెండర్లలో పాల్గొనాలి: వివేక్ వెంకటస్వామి
- టెండర్ల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి అప్పీల్ చేశా
- అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తానని వెల్లడి
- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి, జైపూర్, భీమారంలో పర్యటన
కోల్‌బెల్ట్, వెలుగు: కొత్త బొగ్గు గనులపైనే సింగరేణి సంస్థ మనుగడ ఆధారపడి ఉందని, ఆ గనులతోనే కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలం పాటలో సింగరేణి కూడా పాల్గొని టెండర్లు వేయాలని సూచించారు. లేదంటే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు, జైపూర్, భీమారం మండలాల్లో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా భీమారం మండలంలోని నేషనల్ హైవే 63 నుంచి నర్వ గ్రామం మీదుగా మిట్టపెల్లి గ్రామం వరకు సీఆర్ఆర్ ఫండ్స్ రూ.2 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రి, భీమారంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వరుసగా బొగ్గు గనులు మూతపడుతుండటంతో ఉద్యోగాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడానికి టెండర్ ప్రక్రియలో సింగరేణి పాల్గొనాలని, ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశామని వెల్లడించారు.
ఈ విషయంపై అన్ని పొలిటికల్ పార్టీలు రాజకీయాలు పక్కనబెట్టి.. ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేరుగా గనులు అలాట్మెంట్ చేసుకుంటే 14 శాతం ఎక్కువ రాయల్టీ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందని.. ఇది ఏ మాత్రం సింగరేణికి మేలు కాదన్నారు. నేరుగా టెండర్ ప్రక్రియలో పాల్గొని గనులు దక్కించుకుంటే లాభదాయకమని పేర్కొన్నారు.
నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తా..
చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌తో చర్చించానన్నారు. నష్టం జరిగిన పంటలపై వ్యవసాయాధికారులతో సర్వే చేయిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో వడ్ల కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా డ్రై అయిన తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తారని వెల్లడించారు. అలాగే, చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో రూ.వంద కోట్ల ఫండ్స్‌తో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు వెల్లడించారు. రూ.100 కోట్లతో అమృత్ పథకం కింద చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పనులకు త్వరలో టీయూఎఫ్ ఐడీసీ రూ.100 కోట్ల నిధులతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు చేపడతామని చెప్పారు. చెన్నూరు నియోజక వర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వివిధ అభివృద్ధి పనుల కోసం ఆర్ అండ్ బీ నుంచి రూ.70 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.15 కోట్ల ప్రతిపాదనలకు క్లియరెన్స్ వచ్చిందని వెల్లడించారు.
నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 12 వేల దరఖాస్తులు వచ్చాయని, అందరికీ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కోరానన్నారు. పదేండ్ల కాలంలో కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. జూన్2 నుంచి అమల్లోకి రానున్న రాజీవ్ యువ వికాసం స్కీంను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వం ప్రజలను హింసించింది
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ రాజ్యం నడిచిందని, ప్రజలను ఆ పార్టీ నాయకులు హింసించారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తున్నదని.. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్హయాంలో కమీషన్ల కోసమే పనులు చేపట్టారని ఆరోపించారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అంతకు ముందు భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా అర్కపల్లి గ్రామశివారులోని సుమారు 200 ఎకరాల భూములకు సాగు నీరు అందించేందుకు చొరవ చూపాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే.. ప్రత్యేక కాలువ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాగు నీటి శాఖ ఈఈ విష్ణుప్రసాద్‌ను ఆదేశించారు.