మల్కాజ్‌గిరి పార్లమెంట్ అంటే మినీ ఇండియా అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కిందపడిపోయిన తనను మల్కాజ్‌గిరి ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. మల్కాజ్‌గిరి ప్రజల వల్లే తాను సీఎం అయ్యానని చెప్పారు. 2026 జూన్ 07న మల్కాజ్ గిరి నియోజక వర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన సీఎం.. సీఎంగా మల్కాజ్‌గిరి అభివృద్ధిపై దృష్టి పెట్టానని అన్నారు.
రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల్లో లబ్ది కోసం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చేశారని కొందరు అంటున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసం 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేయలేదు.. పరిపాలనా సౌలభ్యం కోసం చేశాం. మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది.. అని సీఎం రేవంత్ అన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి ఉప్పల్ భగాయత్ లే అవుట్ లో రూ. 1,511 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణంతో పాటు, రూ. 960 కోట్లతో AOC సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, రూ. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్‌లో 6 వరుసల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం, రూ. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మెట్రో విస్తరణకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. మెట్రోతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి నగర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. నగర అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమనా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది ప్రక్షాళన చేసుకున్నప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయొద్దని ప్రశ్నించారు. 55 కిలోమీటర్ల మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటే నగరం అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌తో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 50 సార్లు ఢిల్లీ వెళ్లి మోడీని కలిశానని తెలిపారు. ధాన్యం కొనుగోలు, మెట్రో అనుమతుల బాధత్య కిషన్‌రెడ్డికి లేదా.? అని ప్రశ్నించారు.
