ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు..అడిగిన అన్నింటికీ ఒకే చెప్పిన సీఎం రేవంత్రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు..అడిగిన అన్నింటికీ ఒకే చెప్పిన సీఎం రేవంత్రెడ్డి
  • అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సూచన
  • చనాఖా, కోరాటాకు రాంచందర్​రెడ్డి, సదర్మాట్​కు నర్సారెడ్డి పేర్లు​
  • సీఎం సభ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో జోష్​

నిర్మల్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అడిగిన అన్నింటికీ సీఎం ఓకే చెప్పడంతో సంబురాల్లో మునిగిపోయారు.​ కాంగ్రెస్​ప్రజాప్రతినిధులే కాకుండా బీజేపీ వాళ్లు చేసిన సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బహిరంగ సభావేదికపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి పలు అంశాలను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ప్రజల కోరిక మేరకు బాసర ట్రిపుల్​ఐటీలో నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలంటూ వేదికపై నుంచే ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావుకు సీఎం సూచించారు. నిర్మల్​లో ఏటీసీ సెంటర్​ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బాసరలో యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో అన్ని ప్రాంతాల నాయకులు, మేధావులు, విద్యావంతులు సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు.

 పాలమూరు జిల్లాకు ఎలా నిధులు ఇస్తున్నానో.. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఏండ్ల నుంచి నిలిచిపోయిన కాళేశ్వరం 27వ నంబర్​ ప్యాకేజీ కాలువకు నిధులు ఇస్తానన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అతి పెద్ద పారిశ్రామిక కారిడార్​ ఏర్పాటు చేస్తామని, దీని కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరిస్తామని సీఎం తెలిపారు. కాలువలు, లిఫ్ట్​ ఇరిగేషన్ ఆధునీకరణకు సైతం నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. సదర్మాట్ బ్యారేజీ, చనాఖా కోరటా బ్యారేజీలను ప్రారంభించడమే కాకుండా యాసంగి పంటలకు ఈ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. 

చనాఖా, కోరాటాకు రాంచందర్​రెడ్డి, సదర్మాట్​కు నర్సారెడ్డిల పేర్లు..

స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు సదర్మాట్​బ్యారేజీకి మాజీ ఇరిగేషన్​మంత్రి నర్సారెడ్డి పేరు, చనాఖా కోరాటా బ్యారేజీకి మాజీ మంత్రి రాంచందర్​రెడ్డి పేర్లు పెడుతున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్​ జిల్లాలో మంత్రిగా పని చేసిన రాంచంద్రారెడ్డి ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన హయాంలో ఈ బ్యారేజీకి రూపకల్పన జరిగిందని, నిర్మల్​ జిల్లాకు చెందిన నర్సారెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్​గా, రెవెన్యూ, ఇరిగేషన్​ మంత్రిగా పని చేశారని, ఆయన హయాంలోనే స్వర్ణ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి.. సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. 

దీంతో సీఎం వేదికపైనే వారి బ్యారేజీలకు నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్మల్​ పట్టణానికి దూరంగా ఉన్న కొత్త కలెక్టరేట్​ను అక్కడి నుంచి తరలించాలని, పట్టణ నడిబొడ్డున నిర్మించాలంటూ అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్, స్టేడియం నిర్మాణంపై ఫిబ్రవరి మొదటి వారంలోగా సమీక్ష నిర్వహించి భూసేకరణ తదితర అంశాలపై దృష్టి సారించాలంటూ ఇన్​చార్జి మంత్రి జూపల్లికి సీఎం సూచించారు. 

సీఎం టూర్​ సక్సెస్..

జిల్లాలో సీఎం రేవ్ంత్ రెడ్డి టూర్ సక్సెస్​కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో సీఎం పర్యటన కాంగ్రెస్​కు కలిసి వస్తుందని సంబుర పడుతున్నారు. స్థానికుల డిమాండ్లను అన్నింటినీ ముందుగానే తెలుసుకున్న సీఎం వేదికపైనే హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు కలిసోచ్చే అవకాశం ఉందని స్థానిక నాయకులు భావిస్తున్నారు.