తల్లుల దీవెనలే.. నన్నిక్కడ నిలబెట్టాయి.. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క

తల్లుల దీవెనలే.. నన్నిక్కడ నిలబెట్టాయి.. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
  • ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి
  • ఏరియల్​ వ్యూలో మేడారం పరిసరాల పరిశీలన
  • మాస్టర్​ ప్లాన్​ పూర్తయితే జన్మధన్మమైనట్లే : మంత్రి సీతక్క

ములుగు/ ఏటూరునాగారం/ తాడ్వాయి, వెలుగు :  సమ్మక్క, సారలమ్మలు, గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండి, రాతి కట్టడాలతో ఆలయ ప్రాంగణం తదితర వివరాలతో రూపొందించిన మాస్టర్​ ప్లాన్​ ఏవీ అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. మంగళవారం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభానికి సీఎంతోపాటు ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. 

వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పొరిక బాలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,  కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్​బొకేలతో స్వాగతం పలికారు. ముందుగా సీఎం హెలికాప్టర్ లో ఏరియల్​ వ్యూ ద్వారా మేడారం గద్దెల పరిసరాలైన చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాలు పరిశీలించి, గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కోయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. 

ఆ తర్వాత వారు సమ్మక్క, సారలమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, బెల్లం, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎం మంత్రులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో మంత్రులు, అధికారులు, పూజారులతో కలిసి మాస్టర్​ప్లాన్​పై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రసంగించారు. 

పాదయాత్రను గుర్తుచేసుకొని.. 

ములుగు జిల్లాతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 2016 డిసెంబర్​ 1న జర్నలిస్టుల పాదయాత్ర, సబ్బండ వర్గాలు చేపట్టిన జిల్లా సాధన ఉద్యమానికి మద్ధతుగా ఆత్మగౌరవ సభలో పాల్గొనడం, 2023 ఫిబ్రవరి 6న హాత్​ సే హాత్​ జోడో యాత్రను మేడారం వనదేవతల చెంత నుంచి ప్రారంభించుకోవడాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

తల్లుల దీవెనలు, సంకల్పబలం తనను ఇక్కడ నిలబెట్టాయని పేర్కొన్నారు. 2024లో సీఎంగా మొదటి సారి అమ్మవార్ల దర్శనం సందర్భంగా తులాబారం 68కిలోలు ఉండగా, మంగళవారం ఇచ్చిన తులాభారం కూడా 68కిలోలే ఉండడం విశేషం. ఈ సందర్భంగా పూజారులు ముఖ్యమంత్రికి సాంప్రదాయ వస్త్రాలు అందజేశారు.

పనులు పూర్తయితే జన్మధన్మమైనట్లే :  మంత్రి సీతక్క

ఏ సీఎం మేడారం జాతరకు ముందస్తుగా రాలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోరంత అడిగితే కొండంత ఇచ్చి స్వయంగా మేడారం తరలివచ్చి అభివృద్ధి పనులను ప్రారంభించినందుకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వనదేవతల అభివృద్ధిలో భాగస్వామ్యం అవడం తన అదృష్టమని, పూజారులు, ఆదివాసీలు రీసెర్చ్​ స్కాలర్స్​ అందరి భాగస్వామ్యంతో పనులు పూర్తి చేస్తామన్నారు. వన దేవతల ఆశీర్వాదం వల్లనే తాను ఇంతటి దాన్ని అయ్యానని చెప్పుకొచ్చారు. 

భక్తుల విశ్వాసం, నమ్మకం, ఆదివాసీల ఆచార సాంప్రదాయాల మేరకు గద్దెలు, గుడి ప్రాంగణం చుట్టూ నిర్మాణాలను రాతితో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్ తరాలకు సమ్మక్క సారలమ్మ కీర్తి గుర్తుండేలా చూస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్ష హోదాలో తల్లుల ఆశీస్సులతో సీఎం అయ్యి 2024లో ముఖ్యమంత్రిగా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని, అందరి సపోర్ట్ తో మరింత ముందుకు వెళ్తామని సీతక్క స్పష్టం చేశారు. 

5వేల మంది మహిళలు, వెయ్యి మంది పోలీసులు..

సీఎం టూర్​ నేపథ్యంలో 5వేల మంది మహిళలు మేడారం తరలివచ్చారు. ఉదయం వచ్చిన వారు మధ్యాహ్నం 3గంటల వరకు సీఎం స్పీచ్​ కోసం ఓపికగా కూర్చున్నారు. ఎస్పీ పి.శబరీశ్​ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టర్​ మేడారం పరిసరాలను నో ప్లయింగ్​జోన్​గా ప్రకటించారు. సుమారు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

 కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట రావు, బాలు నాయక్, కడియం శ్రీహరి, మురళీ నాయక్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మా బొజ్జు, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్​ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మేడారం ఆలయ ఈవో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

మాస్టర ప్లాన్​పై ప్రశంసలు.. 

అయ్యప్ప మాల ధరించినట్లు వంద రోజులు అధికారులు ఇక్కడే ఉండి మాస్టర్​ప్లాన్​అమలు చేసి పూర్తిచేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన ఏవీని ప్రదర్శించారు. ఏవీలో సమ్మక్క, సారలమ్మలు, గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెలు ఒకే వరుసలు ఉండడంతోపాటు రాతి కట్టడాలతో ఆలయ ప్రాంగణం అద్వితీయంగా ఉందని అక్కడున్నవారు కూడా కితాబిచ్చారు. పనులు పూర్తయితే జాతరకు వచ్చే భక్తులు సుమారు 10వేల మంది ఒకేసారి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తనివితీరా దర్శించుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.