- భారీగా తరలివచ్చిన జనం, పార్టీశ్రేణులు
- రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు
ఆదిలాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి హెలిక్యాప్టర్లో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఏయిరోడ్రాం మైదానానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలో రూ.260.45 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, అధికారులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం రూ.18.70 కోట్లతో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ పనులు ప్రారంభం, రూ.19.69 కోట్లతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు.
రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో మహాలక్ష్మీవాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీలో రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, రూ.2.6 కోట్లతో మూడు ఇంటెలిజెన్స్ విభాగం క్వార్టర్స్, రూ.2 కోట్లతో భరోసా కేంద్రం, ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న రూ. 2.31 కోట్లతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద 33/11 కేబీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపనలు చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఇన్ని కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం ఇదే మొదటసారి కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాను దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలుపుతానని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, ఏయిర్ పోర్టు నిర్మాణం, సీసీఐ పునర్ణీర్మాణం, యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం హామీ ఇవ్వడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లో ఫుల్ జోష్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. స్టేజీ పైకి ఆయన రాగానే ఒక్కసారి సీఎం.. సీఎం అంటూ నినాదాలతో సభ మార్మోగింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం జిల్లాకు రావడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వరాలు జల్లు కురిపించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
భారీ బందోబస్తు..
సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ దగ్గరుండి చూసుకున్నారు. ప్రియదర్శిని స్టేడియం వెళ్లేదారులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రజలు, నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
విమనాశ్రయ మైదానంలో సీఎం హెలిక్యాప్టర్ దిగడం, అక్కడి నుంచి స్టేడియానికి వచ్చే కాన్వాయ్ మొత్తం వీడియో విజువల్స్ ను సభ వేదికపై చూపిచడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కళాకారులు పాటలతో అలరించి సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియోజకవర్గాల సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందజేయడంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
